‘ఆ ఐదుగురు’ భవిష్యత్ నిర్ణయించనున్న కిరణ్ డిల్లీ పర్యటన

 

జగన్ అక్రమాస్తుల కేసులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు, ఆమె చాలా కలతచెంది కొన్నిరోజులు తన విధులకు హాజరు కాకుండా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఆమె కుర్చీ ఖాళీ చేయక ముందే దానిలో కూర్చొనేందుకు ఆమె సహచర మంత్రులు అందరూ యధాశక్తిన చక్రం తిప్పి చూసారు. గానీ, డిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం వారందరికీ ఏమి మంత్రం వేసిందో గానీ, ఆ తరువాత ఎవరూ కూడా హోంమంత్రి పదవి కావాలంటూ మాట్లాడిన దాఖాలాలు లేవు.

 

క్రమంగా పరిస్థితులు కొంచెం చల్లబడినట్లు కనబడిన తరువాతనే ఆమె మళ్ళీ తన విధులకి హాజరు కావడం మొదలుపెట్టారు. గానీ, మళ్ళీ ఆమె నెత్తిన సీబీఐ పిడుగు పడింది. ఈసారి కోర్టు బోనులో సీబీఐ న్యాయవాదులు అడిగే ప్రశ్నలకు ఆమె జవాబు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడంతో, ఆమెలో మళ్ళీ కలవరం మొదలయింది. ఆమె ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సీబీఐ జారీ చేసిన సమన్ల గురించి చర్చించారు.

 

అయితే, రేపు ఆయన డిల్లీ వెళ్లి అధిష్టానంతో భేటీ కాబోతున్నందున, ప్రస్తుతం ఆమెను ఓదార్చడం మినహా ఆయన కూడా చేయగలిగిందేమీ లేదు. కేంద్రంలో అవినీతి ఆరోపణలలో చిక్కుకొన్న ఇద్దరు మంత్రులకు ఉద్వాసన జరిగినందున, రాష్ట్రంలో ‘ఆ ఐదుగురు’ సంగతి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చును.

 

ఇక, కర్ణాటక ఎన్నికలలో అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు తమ పార్టీకి ఓటేసి గెలిపించారని స్వయంగా కాంగ్రెస్ నేతలే గొప్పలు చెప్పుకొంటున్నందున, రానున్న ఎన్నికలలో కేంద్రం మనుగడకు కీలకమయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నఐదుగురు మంత్రులను, కేవలం వారిపై సానుభూతితో ప్రభుత్వంలో కొనసాగించేందుకు రాహుల్ గాంధీ అంగీకరిస్తారని భావించలేము. వారిని పదవుల నుండి తప్పించి, వారికి తగిన న్యాయ సహాయం చేసే అవకాశం ఉంది. కానీ, ఒకసారి ప్రభుత్వం నుండి వారిని పక్కన పెట్టేసిన తరువాత, ఇక వారి పట్ల ప్రభుత్వానికే కాదు పార్టీకి కూడా క్రమంగా ఆసక్తి తగ్గిపోతుందని చెప్పడానికి మంత్రి మోపిదేవి వెంకట రమణే ఒక చక్కటి ఉదాహరణ. ఒకవేళ రేపు రాహుల్ గాంధీ గనుక సీబీఐ చార్జ్ షీటు కెక్కిన ఐదుగురు మంత్రులను ప్రభుత్వం నుండి తప్పించమని కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించినట్లయితే, ఇక వారికి కష్ట కాలం మొదలయిపోయినట్లే.

 

ఇంత కాలం మంత్రులుగా ఉన్నందున వారికి ప్రభుత్వ రక్షణ ఛత్రం ఉంది. కానీ అది తొలగిపోతే, ఇక వారిని విచారించేందుకు, అవసరమయితే అరెస్ట్ చేసేందుకు ఇక సీబీఐకి ఎవరి అనుమతీ అవసరం ఉండదు. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఇదే అంశాన్నిరాహుల్ గాంధీకి తెలియజేసి వారిని కనీసం అప్రదానమయిన పదవులలోనయినా కొనసాగించేందుకు అనుమతి కోరవచ్చును. తద్వారా ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డిలాగే తన మంత్రివర్గ సహచరులను కోడి, పిల్లలను కాపాడుకొన్నట్లు కాపాడుకొంటారనే ఖ్యాతిని, దానితో బాటు రానున్న ఎన్నికలలో ‘ఆ ఐదుగురు’ నుండి పూర్తి సహకారం పొందవచ్చును.

 

కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ పెద్దలను కలిసి తిరిగి వచ్చేవరకు ‘ఆ ఐదుగురు’ ఈ టెన్షన్ భరిస్తూ ఆత్రంగా ఎదురు చూడక తప్పదు.