చరిత్ర కాదు.. చరిత్రహీనం!

 

 

 

తెలంగాణ తెచ్చింది మేమేనని చెప్పుకోవడానికి అటు టీ కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ చేస్తున్న ఫీట్లు చూస్తుంటే నవ్వొస్తోంది. తెలంగాణ వచ్చేసిందని తెలంగాణ కాంగ్రెసోళ్ళు కృతజ్ఞతల సభలు.. ఆ సభలు.. ఈ సభలు అంటూ బిజీగా వుంటే, టీఆర్ఎస్సోళ్ళు మేం మాత్రం తక్కువా అని దీక్షాదివస్ అనే కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ నిరాహారదీక్ష విరమించి నాలుగేళ్ళయిన సందర్భంగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ‘దీక్షాదివస్’ నిర్వహించారు.

 

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు ఆయన్ని తెలుగువారు ఎంతగా కీర్తించారో, ఇప్పుడు కేసీఆర్ని కూడా టీఆర్ఎస్ నాయకులు అంతకు పదిరెట్లు కీర్తిస్తున్నారు. ఒక వి‘భజనుడు’ కేసీఅంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని గొంతు చించుకు అరిస్తే, మరొక విభజనుడు కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష చరిత్రలో నిలిచిపోతుందని అని నమ్మకంగా చెప్పాడు. కేసీఆర్ కారణంగానే తెలంగాణ ఉద్యమం ఇంత ‘శాంతియుతం’గా జరుగుతోందని ఒక విభజనుడు పులకరించిపోతూ వివరించాడు. తెలంగాణ పోరాటం క్రెడిట్ అంతా కేసీఆర్ అకౌంట్లోకే చేరాలని ఇంకొక విభజనుడు వెర్రిగా అరిచాడు.



ఈ సమావేశం సందర్భంగా మరో కామెడీ కూడా చేశారు. కేసీఆర్‌ని శ్రీరాముడి గెటప్‌లో చూపిస్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని చూసి టీఆర్ఎస్ సేన మురిసిపోయిందేమోగానీ, దారినపోయే జనం మాత్రం దాన్ని చూసి నవ్వుకున్నారు. కేసీఆర్ చేసిన దీక్ష చరిత్ర సృష్టించిందని టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఫ్లూయిడ్లతో చేసిన సదరు దీక్ష ఎంత చరిత్ర హీనమైనదో వాళ్ళ మనసులని అడిగితే చెబుతుంది. ఇదే దీక్షా శిబిరంలో టీఆర్ఎస్ చేసిన ఒక ప్రకటన విమర్శనార్హంగా వుంది. తెలంగాణ రాగానే, తెలంగాణ కోసం అమరవీరులైన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారట. వారి కుటుంబానికి 5 నుంచి 10 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారట. ఇలా ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ నాయకులు ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో, ఎవర్ని రెచ్చగొట్టదలచుకున్నారో వారికే తెలుసు.