కొంతమందికి స్వీట్స్ అంటే ఎందుకంత ఇష్టం?

 

‘వీడు అన్నంకంటే చాక్లెట్లే ఎక్కువ తింటాడు?’, ‘వాడు రోజుకి పావుకిలో స్వీట్స్ తింటుంటాడు’... లాంటి మాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. జిలేబీ బండినో, స్వీట్ షాపునో చూడగానే ఆగిపోయే మనుషులూ మనకి తెలుసు. ఇంతకీ మనలో కొందరికి తీపి అంటే ఎందుకంత ప్రాణం. మరికొందరు స్వీట్స్‌ అంటే ఎందుకంత నిస్తేజంగా ఉంటారు. దీని వెనుక కేవలం మన అభిరుచులే కారణమా?

 

తీపి పట్ల కొందరికి ఎక్కువ ఇష్టం ఉండటానికి జన్యుపరమైన కారణం ఏమన్నా ఉందేమో కనుక్కొనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ఎలుకలలోనూ, కోతుల్లోనూ చేసిన పరిశోధనల్లో FGF21 అనే జన్యువు ఈ విషయంలో చాలా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఈ జన్యువుకి తీపి పదార్థాలని దూరంగా ఉంచే సామర్థ్యం ఉందట. అంటే ఈ జన్యువు సవ్యంగా ఉన్నవారు తక్కువ తీపిని తింటారన్నమాట.

 

తీపి గురించి జంతువుల మీద చేసిన ప్రయోగం మనుషుల విషయంలో రుజువవుతుందా లేదా తెలుసుకోవాలనుకున్నారు డెన్మార్కు దేశపు శాస్త్రవేత్తలు. దీనికోసం వారు Inter 99 study పేరుతో 6,500 మందిని ఎన్నుకొన్నారు. వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు... లాంట వివరాలన్నీ సేకరించారు. వారిలో FGF21 జన్యువు ఏ తీరున ఉందో గమనించారు.

 

తీపంటే బాగా ఇష్టపడేవారిలో FGF21లో మార్పులు ఉన్నట్లు తేలింది. ఇలాంటివారు 20 శాతం ఎక్కువగా తీపిని ఇష్టపడుతున్నారట. FGF21 జన్యవు సవ్యంగా ఉన్న వ్యక్తులలోనేమో, తీపిపదార్థాలు తినకుండా ఆ జన్యవు ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. ఈ జన్యువులో మార్పు ఉన్న వ్యక్తులు కేవలం తీపిని ఇష్టపడటమే కాదు... మద్యపానం, పొగతాగడం ఎక్కువగా చేయడాన్ని కూడా గమనించారు.

 

స్వీట్స్ పట్ల వ్యసనానికి మనలోని ఒక జన్యులోపమే కారణం అని తేలిపోయింది. భవిష్యత్తులో ఈ లోపాన్ని మందులతో సరిదిద్దే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అప్పటివరకు ఎలాగొలా తీపి పట్ల వ్యామోహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయమని సూచిస్తున్నారు. ఊబకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్... లాంటి నానారకాల సమస్యలకూ తీపి కారణం అవుతోందని హెచ్చరిస్తున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ... తీపికి అలవాటు పడ్డ నాలుకని అదుపుచేయడం అంత సాధ్యం కాదని శాస్త్రవేత్తలే సెలవిస్తున్నారు కదా!

 

- నిర్జర.