బీజేపీని క్షమాపణ కోరిన షిండే

 

హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే తమను హిందూ ఉగ్రవాదులుగా వర్ణించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ నేతలు, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పకపోయినట్లయితే, కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరించిన నేపద్యంలో తొలుత కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ, హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే చెప్పినట్లు బీజేపీ సంఘవిద్రోహ పనులకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ భావించట్లేదని, ఈ విషయంపై షిండే కూడా ఇప్పటికే చాలాసార్లు తన వివరణ ఇచ్చారని, త్వరలోనే ఆయన బీజేపీ నాయకురాలు సుష్మ స్వరాజ్ తో స్వయంగా మాట్లాడతారని అన్నారు.

 

ఈ విషయంలో పార్టీ తనను సమర్దించట్లేదని షిండేకు అర్ధమయిన తరువాత ఆయన కూడా బీజేపీను క్షమాపణలు కోరారు. అఖిల పక్షం తరువాత అత్యుత్సాహం ప్రదర్శించి ‘నెల రోజుల్లో తెలంగాణా సంగతి తేల్చి పారేస్తా’ అని ప్రకటించి షిండే మొదటిసారి స్వయంగా చిక్కులో పడి పార్టీని కూడా చాలా చిక్కుల్లో పెట్టారు. బీజేపీని హిందూ ఉగ్రవాదులంటూ మళ్ళీ మరోమారు నోరుజారి షిండే తనకీ, పార్టీకి ఇబ్బందులు కోరి తెచ్చుకొన్నారు. బహుశః మరో మారు ఇటువంటి తప్పు చేస్తే, పార్టీ ఆయనను ఉపేక్షించకకపోవచ్చును. ఈ వివాదానికి ఇంతటితో తెరపడినా, కాంగ్రెస్ పార్టీని అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణంతో పార్లమెంటులో నిలదీసేందుకు బీజేపీ ఆయుధాలు సిద్దం చేసుకొంటోంది.