బీసీసీఐలో "రాజకీయా"నికి ఇక చెల్లు చీటీ

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐకీ సుప్రీం చెంపదెబ్బ లాంటి తీర్పునిచ్చింది. బోర్డును శాసిస్తున్న పొలిటికల్ లీడర్లకు..ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన వృద్ధ నాయకులకు అడ్డుకట్ట వేసింది. బీసీసీఐ ప్రక్షాళనకు జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. లోథా కమిటీ సిఫారసులకు ఆమోద ముద్ర వేస్తూ వాటిని ఆరు నెలల్లోగా అమలు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎంఐ కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది.  భారత్‌లో క్రీడా సంఘాలు రాజకీయ నాయకుల చెరలో మగ్గిపోవడం ఇవాళ కొత్త కాదు. ఏనాటి నుంచో కొనసాగుతోంది. నిజానికి రాజకీయాలు వేరు, క్రీడలు వేరు..రెండు పరస్పర భిన్నమైన రంగాలు. అయితే క్రీడతో ఏ మాత్రం సంబంధంలేని, క్రీడాకారులు కాని వ్యక్తులు క్రీడా సంఘాలను తమ అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంటూ చక్రం తిప్పుతూ వాటిని భ్రష్టు పట్టిస్తున్నారు.

 

ఇలా ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల కనుసన్నల్లోనే భారత క్రీడా సంఘాలు మనుగడ సాగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐతో పాటు దానికి అనుబంధంగా ఉన్న 28 క్రికెట్ సంఘాల్లోనూ రాజకీయ నేతలు వారి అనుయాయుల హవానే కనిపిస్తుంది. బెంగాల్‌ క్రికెట్‌ సంఘానికి జగ్‌మోహన్‌ దాల్మియా, దిల్లీ క్రికెట్‌ సంఘానికి అరుణ్‌జైట్లీ, కశ్మీర్‌ క్రికెట్‌ సంఘానికి ఫరూక్‌ అబ్దుల్లా, బిహార్‌ క్రికెట్‌ సంఘానికి లాలూప్రసాద్‌ యాదవ్‌, రాజస్థాన్‌ క్రికెట్‌ సంఘానికి లిలిత్‌మోడీ, తమిళనాడు క్రికెట్‌ సంఘానికి ఎన్‌.శ్రీనివాసన్‌ గతంలో అధ్యక్షులుగా వహించినవారే. అంతేకాదు బీసీసీఐతో పాటు ఐసీసీకి సైతం మరాఠా యోధుడు శరద్‌పవార్‌, తమిళనాడు వ్యాపారవేత్త ఎన్‌.శ్రీనివాసన్‌ నేతృత్వం వహించినవారే.

 

ఇలాంటి పరిస్థితుల్లో 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌తో పాటు రాజకీయ రంగాలను ఒక కుదుపు కుదిపింది. స్కామ్ విచారణకు రిటైర్డ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బీసీసీఐని ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని చెప్పింది. దీంతో జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలో జస్టిస్ అశోక్ బాన్, జస్టిస్ రవీంద్రన్ సభ్యులుగా కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుమారు ఏడాది పాటు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన లోథా కమిటీ ఐపీఎల్ ప్రాంచైజీలు చెన్నై, రాజస్థాన్‌లపై రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. అనంతరం బోర్డులో సమూల మార్పులను సూచిస్తూ అనేక సిఫారసులు చేసింది. వాటి అమలుపై కోర్టులో..బీసీసీఐ దాని అనుబంధ సంఘాలు వాదనలు వినిపించాయి. అలా అన్ని రకాల వాదనలు విన్న సుప్రీం ఈ ఏడాది జూన్ 30న లోథా కమిటీ సిఫారసుల అమలుపై వాదనలను ముగించి నిన్న చారిత్రక తీర్పును వెలువరించింది. 


సుప్రీం కోర్టు ఆమోదించిన సిఫారసులు:


- మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారులు, 70 ఏళ్లకు పైగా వయసున్న వారు బీసీసీఐలో సభ్యులుగా ఉండకూడదు.
  ఒక రాష్ర్టానికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. 
- పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు చెక్‌ పెట్టాలంటే క్రికెట్‌ యంత్రాంగంలో ఒక వ్యక్తికి ఒక పదవి మాత్రమే ఉండాలి. 
- బీసీసీఐలో కాగ్‌ ప్రతినిధి, క్రీడాకారుల సంఘం ఉండాలి. బీసీసీఐలో కాగ్‌ నామినీ వచ్చిన తర్వాత ఇతర పాలన      కమిటీలన్నీ రద్దయిపోవాలి. 
- క్రికెటర్ల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి బోర్డే ఆర్థిక సహకారం అందించాలి.
- ప్రస్తుతం బోర్డులో వర్కింగ్ కమిటీని రద్దు చేసి దాని స్థానంలో తొమ్మిది మంది సభ్యులతో అపెక్స్ కమిటీని ఏర్పాటు    చేయాలి. ఇందులో ఒక మహిళా క్రికెటర్ సహా ఆటగాళ్ల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి.
- బోర్డులో ఆఫీస్ బేరర్ల సంఖ్యను ఐదుకు తగ్గించాలి. దీని ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త    కార్యదర్శి, కోశాధికారి మాత్రమే ఉంటారు. 

 

అనురాగ్ ఠాకూర్ తప్పుకోవాల్సిందే:
లోధా కమిటీ సూచన ప్రకారం బోర్డులో ఏ ఆఫీస్ బేరర్ కూడా ఒకసారికి మూడేళ్ల చొప్పున మూడు పర్యాయల కంటే మించి పదవుల్లో ఉండరాదు. ఏ ఆఫీస్ బేరర్ కూడా వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉండటానికి వీల్లేదు. అలాగే జోడు పదవుల్లో ఉన్న వారు ఒక పదవిని వదులుకోవాలి. ప్రస్తుత అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ అధ్యక్షుడిగానూ..హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఆయన ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.

 


పవార్, శ్రీని శకం ముగిసినట్లే..
అన్ని పదవులకు వయోపరిమితి ఉన్నట్లే బీసీసీఐ ఆఫీసు బేరర్లకు 70 ఏళ్ల వయోపరిమితిని విధించాలన్న లోధా కమిటీ సూచనను సుప్రీం ఆమోదించడంతో శరద్‌పవార్, శ్రీనివాసన్, నిరంజన్‌షా వంటి ప్రముఖుల శకం ముగిసిపోయినట్లే. ఈ ముగ్గురు 70 ఏళ్లు దాటిన వాళ్లే. 75 ఏళ్ల పవార్ ప్రస్తుతం ముంబయి క్రికెట్ సంఘానికి..71 ఏళ్ల శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు.