Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అయోధ్య కేసు పరిష్కారం.. సుప్రీం సంచలన నిర్ణయం
posted on: Mar 8, 2019 12:28PM

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో 'మధ్యవర్తిత్వా'నికే సుప్రీం కోర్టు మొగ్గు చూపింది. వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించవచ్చా? లేదా? అనే విషయంపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సమస్య శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సామరస్య పరిష్కారం కోసం ఈ కేసును మధ్యవర్తికి అప్పగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు వెల్లడించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడి ప్యానెల్‌ను కూడా నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎం ఖలీఫుల్లా నేతృత్వంలోని ఈ ప్యానెల్‌లో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్నారు. వీరు ముగ్గురూ తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం. విచారణ మొత్తం ఫైజాబాద్‌లో జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. విచారణ ప్రక్రియను నాలుగు వారాల్లో ప్రారంభించి.. 8వారాల్లోగా పూర్తిచేయాలని ప్యానెల్‌ను కోర్టు ఆదేశించింది. మధ్యవర్తుల కమిటీ జరిపే విచారణను రికార్డు చేయాలని ధర్మాసనం పేర్కొంది. మీడియాకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచాలని సూచించింది.
అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా, నిర్మోహి అఖాడా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కేసును మధ్యవర్తులకు అప్పగించేందుకు మొగ్గు చూపింది. అయితే ఇందుకు కొన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించగా.. ముస్లిం సంస్థలు మాత్రం సమర్థించాయి. దీంతో ఈ అంశంపై ఈ నెల 6న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన న్యాయస్థానం.. అయోధ్య కేసును మధ్యవర్తికి అప్పగిస్తూ నేడు ఆదేశాలు జారీ చేసింది.






