సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు

 

ప్రజాప్రయోజన వ్యాజ్యం క్రింద దాఖలు చేయబడిన ఒక ప్రైవేట్ పిటిషను విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ఈ రోజు సంచలనాత్మకమయిన తీర్పు వెలువరించింది. ఇంతవరకు క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్దారించబడిన ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధ్య చట్టంలో సెక్షన్ 8(4) నిబందన క్రింద పై కోర్టులకి అప్పీలుకి వెళ్ళడం ద్వారా అనర్హత వేటు నుండి తప్పించుకొంటున్నారు. ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తూ రాజ్యాంగంలో ఈ నిబంధన న్యాయ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. నేరం జరిగిన సమయం నుండే ప్రజా ప్రతినిధులకు అనర్హత వర్తిస్తుందని పేర్కొంది. అంటే ఎవరయినా ఒక ప్రజాప్రతినిధి నేరం చేసినట్లు ప్రాధమికంగా రుజువయితే, కోర్టు కేసులతో సంబంధం లేకుండా అతను లేదా ఆమెపై అనర్హత వేటు వేయవచ్చునని విస్పష్టంగా చెప్పింది. న్యాయ మూర్తులు యస్.జే.ముఖోపాద్యాయ, ఏకే.పట్నాయక్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు వెలువరించే నాటికి ఉన్నత న్యాయ స్థానాలను ఆశ్రయించిన ప్రజాప్రతినిదులకి ఈ తీర్పు వర్తించదని పేర్కొంది.