వేసవిలో ఈ ఆహారంతో జాగ్రత్త

 

వేసవి భగభగలకి ఒళ్లంతా పొగలు కక్కడం ఖాయం. కానీ ఆహారం విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఏ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే...

 

మితంగా ప్రొటీన్లు:

ఒంట్లో వేడి చేసిందని చెబితే చాలామంది వైద్యులు ఒప్పుకోరు. కానీ కొన్ని పదార్థాలలో ఉండే అధిక ప్రొటీన్ల వల్ల... ఒంట్లోని జీవక్రియ (మెటబాలిజం) వేగం పెరుగుతుందనీ, దాంతో వేడి చేసిన అనుభూతి కలుగుతుందనీ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా అధిక ప్రొటీన్లు ఉండే కోడిగుడ్డు, బాదంపప్పు, ఓట్స్, మెంతులు, చేపలు వంటి ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెంకొంచెంగా తీసుకోమని సూచిస్తున్నారు.

 

నూనెపదార్థాలు:

నూనె ఎక్కువగా ఉండే వేపుళ్లు, చిరుతిళ్ల వంటి పదార్థాలకు వేసవిలో దూరంగా ఉండటమే మంచిదట. నూనె పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పైగా నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల చర్మం కూడా జిడ్డోడుతుందని తేలింది. అలా నూనెపదార్థాలు ఒంటి లోపలా బయటా కూడా చిరాకు కలిగిస్తాయన్నమాట.

 

మద్యపానం:

వేసవి వచ్చిందంటే చాలు... ఆ పేరు చెప్పి పీపాలకు పీపాలు బీరు తాగేస్తుంటారు. ఒకవేళ బీరు దొరక్కపోతే ఎలాంటి మద్యానికైనా సిద్ధంగా ఉంటారు. బీరుతో సహా ఎలాంటి మద్యానికైనా dehydration కలిగించే లక్షణం ఉంది. అందుకనే మద్యం సేవించేటప్పుడు ఒళ్లంతా చెమటలు కక్కడం, మాటిమాటికీ మూత్రానికీ వెళ్లాల్సి రావడం జరుగుతుంది.

 

మామిడిపళ్లు:

వేసవికాలంలో మామిడిపళ్లే గుర్తుకువస్తాయి. ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి కదా! అని ఆబగా లాగించేస్తుంటాం. కానీ మామిడిపళ్లు మోతాదుని మించితే.... విరేచనాలు తప్పవు. పైగా వీటికి వేడి చేసే గుణం కూడా ఉంది. అందుకనే నిరంతరం మామిడిపళ్లు తింటే పెదాలు పగలడం, సెగ్గడ్డలు రావడం జరుగుతుంది.

 

పాలు:

పాల నుంచి వచ్చే పెరుగు, మజ్జిగలు వేసవిలో దాహాన్ని తీరుస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తాయి. కానీ నేరుగా చల్లటి పాలు తాగితే మాత్రం చిక్కులు తప్పవు. చాలామందికి పాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉండదు. పైగా చల్లటి పాలని తాగడం వల్ల, వాటిని తిరిగి శరీర ఉష్ణోగ్రతకి అనుగుణంగా మార్చేందుకు మరింత వేడిని ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇక టీ, కాఫీలలో ఉండే కెఫిన్కి కూడా డీహైడ్రేషన్ కలిగించే లక్షణం ఉంది. ఇవే కాదు మాంసాహారం, మసాలా పదార్థాలు, చపాతీలు... ఇవన్నీ కూడా వేసవి తాపాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందంటున్నారు.

- నిర్జర.