ఈ మహిళల విజయంతో కళ్లు చెదిరిపోవాల్సిందే!

 

కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ, షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ... అంటూ మంచి భార్యకి ఉండాల్సిన లక్షణాలు చెబుతాయి ధార్మిక గ్రంథాలు. కానీ స్త్రీ అంటే కేవలం భార్యేనా? కుటుంబాన్ని చక్కదిద్దడంలోనే ఆమె జీవితానికి సార్థకత దక్కుతుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఆరుగురు విజయగాథలను గర్వంగా చెప్పుకుందాం...

 

సుచీ ముఖర్జీ - ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. బయటకు వెళ్లే ఓపిక లేకనో, ధరలు తక్కువనో.. కారణం ఏదైతేనేం! అంతా ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలా గుర్గావ్కి చెందిన ‘సుచీ ముఖర్జీ’ కూడా ఆన్లైన్ ద్వారా తనకి నచ్చిన బట్టలు కొనాలనుకున్నారు. ప్చ్!! ఎన్ని దుస్తులు చూసినా ఆమెకి నచ్చలేదు. అందరికీ నచ్చేలా కేవలం దుస్తుల కోసమే ఒక ఆన్లైన్ షాపింగ్ సైట్ ఉంటే బాగుండు అనుకున్నారు. ఎవరో దాకా ఎందుకు... తనే limeroad.com పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించారు. ఈ ఆలోచన ఏమేమరకు ఫలితాన్ని ఇచ్చిందో అనుకుంటున్నారా! ఒక్కసారి limeroad.comలోకి వెళ్లి చూడండి. కళ్లు చెదిరిపోతాయి.

 

మిథాలీ టండన్ - నగర జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పగలంతా సమస్యలతో నలిగేవారు సాయంవేళకి కాస్తోకూస్తో మందుపుచ్చుకోవడం అలవాటైపోయింది. ఇక శనాదివారాలు వస్తే చాలు.... వీకెండ్ పార్టీలలో పాల్గొని తీరాల్సిన పరిస్థితి. కానీ పొద్దున్నే లేచి ఆఫిసులకి పరుగులు తీసేదెలా! మద్యం మత్తులో నిస్సత్తువగా, తలనొప్పిగా ఉండే శరీరాన్ని ఉరుకెత్తించేదెలా! ఈ సమస్యకు పరిష్కారం కనుగొని దాన్ని ఓ వ్యాపారచిట్కాగా మార్చేశారు ‘మిథాలీ టండన్’. Morning Fresh పేరుతో హ్యాంగోవర్ తగ్గించే డ్రింక్ను ఉత్పత్తి చేస్తూ... మందుబాబులకు పరిష్కారాన్నీ, తనకి విజయాన్నీ సాధించారు. కావాలంటే drinkmorningfresh.com చూడండి.

 

రష్మీ దాగా - IIM అహ్మదాబాద్లో చదువుకున్న రష్మీ దాగా, బెంగళూరులో కళ్లు చెదిరే జీతంతో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగపు ఒత్తిడిలో పడి అప్పుడప్పుడూ రష్మీ బయటనుంచి భోజనం ఆర్డరు చేసేవారు. ఆ భోజనంతో ఆమెకి ఆకలి తీరేదేమో కానీ తృప్తి మాత్రం కలిగేది కాదు. ఎప్పుడూ ఒకటేరకం కూరలు, ఏదో అమ్ముకోవడం కోసం వండినట్లుగా యాంత్రికంగా తోచే రుచి... దీంతో ఇంటి భోజనంలా ఎప్పడికప్పుడు రుచికరంగా, వైవిధ్యంగా ఉండే ఆహారాన్ని అందచేస్తే ఎంత బాగుండో అనిపించింది. వెంటనే తన ఆలోచనను అమలుచేసేశారు. ఫలితం ఆమె స్థాపించిన హోం డెలివరీ ఆహారం ఇప్పుడు నాలుగు నగరాలలో దొరుకుతోంది. (freshmenu.com)

 

కోమల్ అగర్వాల్ - సెల్ఫోన్ లేని నరమానవుడు కనిపించడం అరుదు. మరి అలాంటి సెల్ఫోనుకి అవసరమయ్యే సదుపాయాలని కొనుక్కోవాలంటే ఒకోటీ ఒకో కంపెనీది కనిపిస్తుంది. దీనికి విరుగుడుగా పవర్బ్యాంక్ల దగ్గర నుంచీ చార్జర్ల వరకూ ఒకే చోట అందిస్తే ఎలా ఉంటుంది అనిపించింది కోమల్ అగర్వాల్ అనే అమ్మాయికి. ఫలితం ‘పెబుల్స్’ బ్రాండ్ ఆవిర్భావం. ఇప్పుడు పెబుల్స్ ఓ వంద కోట్ల సంస్థ.

 

రిచా కౌర్ - ఆడవారి లోదుస్తులు అనగానే అదేదో అసభ్యమైన పదంలా తోస్తుంది. ఆరోగ్యం కోసమో, సౌకర్యం కోసమో మంచి లోదుస్తులు తీసుకోవాలంటే దేశీయంగా ఉత్త పనికిమాలిన సరుకు లభిస్తుంది. ఈ పరిమితులను దాటాలనుకున్నారు ‘రిచా కౌర్’. మన దేశంలోనే మహిళలకు ఆంతర్జాతీయ స్థాయి లోదుస్తులకు ఓ బ్రాండ్ రూపొందించే ప్రయత్నం చేశారు. అదే Zivme. ఆ బ్రాండ్ ఎంత విజయవంతం అయ్యిందో చూడాలంటే zivame.com/లోకి వెళ్లాల్సిందే!

 

సైరీ చాహల్ ¬- సైరీ చాహల్ అవకాశాలను అందిపుచ్చుకునే ఓ వ్యాపారవేత్త. అందుకనే ఇంటర్నెట్ మొదలైన రోజుల్లోనే ఓ వెబ్సైటుని ప్రారంభించి లాభాలను సాధించారు. తన సంగతి సరే! కానీ ప్రతిభ ఉన్నా ఇంటిపనులలో సతమతం అయిపోయే స్త్రీల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది సైరీకి. అంతే! SHEROS పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ప్రతిభకు తగిన ఉపాధిని కల్పించడంలో వేలాదిమంది స్త్రీలకు SHEROS సంస్థ ఓ మాధ్యమంగా నిలుస్తోంది (sheros.in).

(బిజినెస్ ఇన్సైడర్ సౌజన్యంతో)

- నిర్జర.