చేతులుకాలేక ఆకులు పట్టుకొన్న ప్రభుత్వం

 

మొత్తం మీద ప్రతిపక్షాలన్నీ కలిసి బాబ్లీ ప్రాజెక్టుపై ఇంతకాలంగా నిద్రపోతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిద్రలేపగలిగాయి. నెల రోజుల క్రితం సుప్రీం కోర్టు మన రాష్ట్రానికి వ్యతిరేఖంగా బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పు వెలువరించినప్పుడు దానివల్ల మన రాష్ట్రానికి ఎంత మాత్రం నష్టం లేదని బల్ల గుద్ది వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో బాబ్లీపై సుప్రీం కోర్టులో పునర్విచారణకు పిటిషను వేసేందుకు అంగీకరించడమే కాకుండా అవసరమయితే ప్రతిపక్షాలను స్వయంగా డిల్లీ తీసుకువెళ్ళి కేంద్రం మీద రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకు కూడా అంగీకరించారు. అయితే, ఇదే సమావేశం సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నపుడే నిర్వహించి అన్ని పార్టీలను కలుపుకొని ఆనాడే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ రోజు బాబ్లీ ప్రాజెక్టు ఉండేదికాదు.

 

రాష్ట్ర ప్రయోజనాలను కాపడుకోవలాసిన సమయంలో కూడా ప్రతిపక్షాలను సంప్రదించడానికి ముఖ్యమంత్రికి అహం అడ్డుపడటంతో మహారాష్ట్ర పని సులువయిపోయింది. అదీ గాక దేనినయినా రాజకీయ అంశంగా చూసే మన రాజకీయ పార్టీల దురలవాటు కూడా ఈ అనరధానికి మరో కారణం అని చెప్పవచ్చును. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాబ్లీపై మహారాష్ట్ర అక్రమ నిర్మాణం చేపడుతున్నపుడు దానిని ఆపడానికి ప్రయత్నించలేదు.

 

మహారాష్ట్రను అడ్డుకొంటే అక్కడ తన వోటు బ్యాంకుకు గండి పడుతుందని కేంద్రం నిర్లిప్తత వహిస్తే, రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు దానితో రాజకీయచదరంగం ఆడుకొన్నాయి. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసిన అధికార కాంగ్రెస్ పార్టీనే ఇందుకు పూర్తిగా తప్పు పట్టవలసి ఉంటుంది. జరిగిన తప్పు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నపటికీ అహంభావంతో, బేషజాలతో ఇంతకాలం వితండవాదం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తీరికగా అఖిల పక్షం పెట్టి సలహాలు కోరడం, సుప్రీం కోర్టులో పునర్విచారణకు పిటిషను వేసేందుకు అంగీకరించడం, ప్రతిపక్షాలను డిల్లీకి తీసుకువెళతానని హామీలు ఈయడం కేవలం ప్రతిపక్షాలను శాంతింప చేయడానికి మాత్రమే పనికి వస్తాయి తప్ప, మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నుండి అక్రమంగా నీళ్ళని వాడుకోకుండా ఆపలేవు. ఇది కేవలం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం తప్ప మరొకటి కాదు.

 

కనీసం ఇప్పటికయినా ప్రభుత్వానికి ఈవిషయంలో చిత్తశుద్ధి కానీ పశ్చాతాపం కానీ లేకపోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి, అసమర్ధతకు , నిర్లక్ష్యానికి రైతన్నలు మూల్యం చెల్లించవలసి రావడం దారుణం.