కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందుకు దొందు దొందప్పలే

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దొందుకు దొందు దొందప్పలే అన్నట్లు ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బయ్యారం గనుల్లో చిక్కుకొని విలవిలాడుతుంటే, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు గనుల్లో చిక్కుకొని బయట పడలేక నానా తిప్పలు పడుతోంది. అయినప్పటికీ, రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు మొండివైఖరితోనే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం విశేషం.

 

రాష్ట్రంలో బయ్యారం గనుల వ్యవహారంలో కిరణ్ కుమార్ తెలంగాణ నేతలను పూచికపుల్లతో సమానంగా పరిగణిస్తూ తన నిర్ణయాన్నిగట్టిగా సమర్దించుకొంటుంటే, కేంద్రంలో సోనియా గాంధీ బొగ్గు గనుల వ్యవహారంలో ‘ప్రతిపక్షాలను అరుచుకోనివ్వండి మనపని మనం చేసుకు పోదామని’ అనడం గమనిస్తే ఇద్దరి వైఖరిలో తేడా ఏమి లేదని అర్ధం అవుతోంది.

 

బొగ్గు గనులలో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన నివేదికను సుప్రీం కోర్టులో సమర్పించక ముందే, న్యాయ శాఖామంత్రి తన వద్దకు తెప్పించుకొని అందులో కొన్ని సవరణలు చేయడంతో, ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. అందుకు సంజాయిషీ ఇస్తూ మంత్రిగారు కేవలం నివేదికలో భాష, వ్యాకరణ దోషాలను మాత్రమే సరిదిద్దారని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్దించుకోవడం నిజంగా సిగ్గు చేటు. న్యాయ శాఖా మంత్రి దేశానికి న్యాయం చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బయటపడుతున్న అవినీతి గనులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. పార్లమెంటులో ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలకు కాంగ్రెస్ వద్ద ఉన్న ఏకైక అస్త్రం ఎదురు దాడి చేయడమే. అయినా ప్రతిపక్షాలు రాజీనామాలకు పట్టుబట్టడంతో సోనియా గాంధీ “ప్రతిపక్షాలను అరవనీయండి మనం పట్టించుకోనవసరం లేదు” అని అనడం తాము ఎవరికీ జవాబు చెప్పుకోనవసరం లేదని చెప్పడమే. ఆమె ఆవిధంగా చెప్పడం ప్రభుత్వానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల, ప్రతిపక్షాల పట్ల ఎంత చిన్నచూపో తెలియజెపుతోంది.

 

అదేవిధంగా మొన్న సోనియా గాంధీ తమ పార్టీ నేతలకు మరో చక్కటి ఉపదేశం కూడా చేసారు. “ప్రజలు, ముక్యంగా యువతకి మనం సాదించిన ఘనకార్యాల పట్ల బొత్తిగా సంతృప్తి లేదు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదనే మనల్ని నిందిస్తున్నారు. వారికి తగిన విధంగా మనం సమాధానం చెప్పవలసి ఉంది. వారు విమర్శిస్తే దానికి మీరు కూడా దీటుగా జవాబు ఈయండి,” అని ఉద్బోధించారు.

 

మరి ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అనే ప్రశ్న మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఏ విషయంలోనూ స్వపక్షాన్నే కలుపుకు పోలేని కిరణ్ కుమార్ రెడ్డి, ఇక విపక్షాలను మాత్రం ఏవిధంగా కలుపుకు పోగలరు? అందువల్ల కేంద్రాన్ని దానిని నడిపిస్తున్న తమ అధినేత్రి సోనియా గాంధీ అడుగు జాదలలోనే నడుస్తూ ఆమెనే ఆదర్శంగా భావిస్తూ, ప్రతిపక్షాలతో డ్డీ కొంటున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

 

ఇంకా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య చాలానే దగ్గర పోలికలున్నాయి. రెండు చోట్ల ప్రభుత్వాలు బొటాబొటి మెజార్టీతో నడుస్తునాయి. అయినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో దొందుకు దొందే. అక్కడ వరుసపెట్టి 2జీ, వాద్రా భూముల కుంభకోణాలు, బొగ్గు గనులు కుంభకోణాలు, యఫ్.డీ.ఐ., అగస్టా హెలికాఫ్టర్ల అవినీతి బాగోతాలు, లంచాలు వరుసగా బయట పడుతున్నాకూడా కాంగ్రెస్ ఏలికలు ఏదో సాదించి పడేసినట్లు నిర్లజ్జగా భోర విరుచుకొని మరీ తిరుగుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చాపక్రింద దాచిపెట్టి పోయిన అవినీతి భాగోతాలు, సీబీఐ చార్జ్ షీట్లు, పదవుల కోసం మంత్రుల డిల్లీ టూర్లు, పార్టీలో కుమ్ములాటలు, తెలంగాణ సమస్య, దానివల్ల మళ్ళీ కొత్త ముఠాలు, వారి అసమ్మతి, కరెంటు కోతలు, సామాన్యుడి బ్రతుకు భారం చేస్తున్న కరెంటు చార్జీలు, ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా నెత్తికెత్తుకొన్న బయ్యారం గనుల వ్యవహారాలతో ప్రభుత్వానికి పరిపాలనకు సమయం చిక్కడం లేదు.

 

ఈవిధంగా కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందుకు దొందు దొందప్పలేనని రుజువు చేసుకొనేందుకు ఒక దానితో మరొకటి పోటీ పడుతున్నాయి.