పతనావస్థకు చేరుకొంటున్న రాష్ట్ర పరిస్థితులు

 

ప్రస్తుతం రాష్ట్రం సందిగ్ధ పరిస్థితుల్లో ఉంది. తెలంగాణా అంశం, మంత్రులపై అవినీతి ఆరోపణలు, ప్రతిపక్షాల కుమ్ములాటలు, ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, బాంబు ప్రేలుళ్ళు, ధర్నాలు, ఆందోళనలు వంటివి ఒక అరాచక పరిస్థితిని సృష్టించాయి. ప్రభుత్వం రోజుకో కొత్తపధకం ప్రవేశపెడుతూ ప్రజశ్రేయస్సుకోసమే తాము పనిచేస్తున్నామని చెప్పుకొంటుంటే, ప్రతిపక్షాలు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మీడియా కూడా ఒక్కో రాజకీయ పార్టీకి నిస్సిగ్గుగా కొమ్ము కాస్తున్న కారణంగా చివరికి ప్రజలు దానిని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కూడా తమ బాధ్యతలు మరిచి, రాష్ట్ర సంక్షేమం గాలికొదిలి వివిధ కారణాలతో ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకొంటూ కాలక్షేపం చేస్తూ, దానినే రాజకీయంగా భావిస్తున్నారు.

 

అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా నిర్మాణాత్మకమయిన ఆలోచనలు చేయడం ఎన్నడో మరిచిపోయాయి. ఇటువంటి ధోరణి వల్ల రాష్ట్ర పరిస్థితి నానాటికి దిగజారుతున్నపటికీ, ఎటువంటి దిద్దిబాటు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించకపోవడం దారుణం. ఏదయినా సమస్య వచ్చినప్పుడే దాని గురించి ఆలోచించవచ్చుననే నిర్లిప్తత ప్రభుత్వంలో పేర్కొంది.

 

ఇక తెలంగాణా అంశం పట్టుకొని రెండు ప్రాంతాలకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు తమ భాధ్యతలను నిర్వర్తించకుండా సభలు సమావేశాలు పెట్టుకొని ఒకరినొకరు దూషించుకొంటూ, డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తు కాలక్షేపం చేస్తున్నారు. తత్ఫలితంగా రాష్ట్రంలో పాలన అదుపు తప్పి అక్రమ వ్యాపారులకు, అవినీతి ఉద్యోగులకు, అధిక ధరలకు, దొంగతనాలకు, దోపిడీలకు నేడు రాష్ట్రం నిలయంగా మారింది. ఒకనాడు ఇటువంటి పరిస్థితి వెనుకబడిన బీహార్ రాష్ట్రంలో ఉండేది. కానీ ఇప్పుడు మన రాష్ట్రం కూడా ఆ స్థాయికి చేరుకొంది. ఇందుకు ప్రభుత్వాన్ని , ప్రతిపక్షాలను రెంటినీ తప్పు పట్టక తప్పదు.

 

అధికార, ప్రతిపక్షాల ఆశయం రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిగా ఉండాలి. కానీ, అవి నేడు కేవలం రాజకీయ చదరంగం ఆడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకోసం ప్రజలని కూడా వివిధ వర్గాలుగా విడదీసి తమ పావులుగా చేసి ఆడుకొంటున్నాయి. ప్రజలు తమకున్న ఏకైక ఆయుధం ఓటుని సక్రమంగా వినియోగించుకొని ఇటువంటి రాజకీయనేతలకి తగిన బుద్ధి చెప్పగలిగిననాడే పరిస్థితులో మార్పు మొదలవుతుంది. లేకుంటే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తూ భారంగా జీవితాలు వెళ్ళదీయక తప్పదు.