మనిషిని జైల్లో ఉంచితే

మనిషి ఈ విశ్వంలోని రహస్యాలు ఎన్నింటినో ఛేదించి ఉండవచ్చు. కానీ అతని మనసులో ఉన్న మర్మం మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలను వెల్లడిస్తూనే ఉంది. మనిషి మనసులోని ఈ లోతులను గమనించేందుకు ఎన్నో పరిశోధనలు సాగాయి. వాటిలో అత్యంత ఆసక్తికరమైనదీ, వివాదాస్పదమైనదీ ‘The Stanford Prison Experiment’. 1971లో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘ఫిలిప్ జింబార్డో’ రూపొందించిన ఈ పరిశోధన ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. మనస్తత్వ శాస్త్రం గురించి రాసే ప్రతి పాఠ్యపుస్తకంలోనూ దీని ప్రస్తావన తప్పక కనిపిస్తుంది.

తమ చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా మనుషుల ప్రవర్తనలో మార్పులు వస్తాయా? అధికారం తలకెక్కితే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? అన్న ప్రశ్నలకు జవాబులను వెతికేందుకు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం జింబార్డో ఒక 24 మంది అభ్యర్ధులను ఎన్నుకొన్నారు. వీరిలో 12 మంది జైలు అధికారులుగానూ, మరో 12 మంది ఖైదీలు గానూ కొన్నాళ్లపాటు ఉండాలని నిర్దేశించారు. వీరంతా తమ పాత్రలను నిర్వహించేందుకు నిజంగానే జైలుని తలపించేలా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని ఒక భవనం కింద ఓ తాత్కాలిక జైలుని ఏర్పాటుచేశారు.

ఏర్పాట్లన్నీ తాత్కాలికంగానే జరిగినా నిజంగానే అక్కడి వాతావరణం అంతా జైలుని తలపించేలా చర్యలు తీసుకున్నారు. జైలు అధికారులుగా ఉన్నవారికి యూనిఫాం, సన్గ్లాసెస్, లాఠీలను అందించారు. ఇక ఖైదీలుగా ఎన్నుకొన్నవారిని వారి ఇంటి దగ్గరే అరెస్టు చేసి, వారి మీద అభియోగాలు మోపినట్లు పత్రాలను చూపించారు. విశ్వవిద్యాలయంలో ఉన్న ‘జైలు’ గదుల్లో వారిని బంధించి ఒక సంఖ్యని కూడా కేటాయించారు. దీంతో పూర్తిగా జైలు వాతావరణం సిద్ధమైపోయింది. ఇక అక్కడ ఉండేవారు ఎలా ప్రవర్తిస్తారు అని గమనించడమే తరువాయి. జైలు అధికారులను పర్యవేక్షించే సూపరింటెండెంటుగా స్వయంగా జింబార్డోనే రంగంలోకి దిగారు. అప్పటి నుంచీ అసలు కథ మొదలైంది...

జైల్లో ఉండే ఖైదీల మీద చేయి చేసుకోకూడదని మొదట్లోనే జైలు అధికారులందరికీ సూచనలను అందించారు. కానీ తాము అధికారులు, ఖైదీలుగా ఉన్నవారు బలహీనులు అనే అభిప్రాయాన్ని తెచ్చేందుకు ప్రయత్నించవచ్చునని చెప్పారు. ఇలా ఓ రెండువారాల పాటు ఈ పరిశోధనన నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరిశోధన మొదలైన రెండోరోజునే పరిస్థితులు విషమించసాగాయి. ‘జైలు’లో ఉన్న ఖైదీలు ‘తిరుగుబాటు’ చేయడం మొదలుపెట్టారు. దానికి స్పందించిన జైలు ‘అధికారులు’ నిప్పుని ఆర్పే గ్యాస్ని వారి మీదకి వదిలి ఆ తిరుగుబాటుని అణిచివేశారు. రోజులు గడిచేకొద్దీ జైలులో ఉన్నవారంతా నటించడం మానేసి జీవించడం మొదలుపెట్టారు.

రోజురోజుకీ గార్డులు అతి క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మలమూత్రాలను సరిగా శుభ్రం చేయించకుండా అలాగే ఖైదీల గదిలో ఉంచేయడం, మంచాలను ఎత్తించేసి నేల మీదే పడుకునేలా చేయడం, ఒంటరిగా చీకటి గదులలో బంధించడం, నగ్నంగా ఉంచడం వంటి నానావిధాల హింసలను మొదలుపెట్టారు. ఈ అకృత్యాలను కొందరు ఖైదీలు నిశ్శబ్దంగా భరించగా, మరికొందరు తిరగబడేవారు. తిరగబడినవారికి మరిన్ని శిక్షలే దక్కేవి! విచిత్రం ఏమిటంటే పరిశోధనను రూపకల్పన చేసిన జింబార్డో కూడా నిజమైన జైలు అధికారిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.


ఒక ఆరు రోజులు గడిచేసరికి ఇక ఈ పరిశోధనని సాగించడం ప్రమాదకరం అని తేలిపోయింది. పరిశోధనని గమనించేందుకు బయట నుంచి వచ్చిన ఒక విద్యార్థిని పరిస్థితులు విషమిస్తున్నాయంటూ జింబార్డోకి తలంటడంతో అర్ధంతరంగా దీనిని విరమించారు. తామంతా ఒక పరిశోధనలో భాగంగా ఉన్నామనీ, తమ చర్యలను వీడియో తీస్తున్నారనీ తెలిసినా కూడా జైలులో ఉన్నవారి ప్రవర్తన అదుపుతప్పడం పలు పాఠాలను నేర్పింది. మనిషి తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తన ప్రవర్తనను మలుచుకుంటాడనీ, అధికారం అతడిని రాతిగుండెగా మార్చివేస్తుందనీ ఈ పరిశోధనతో తేలిపోయింది.


స్టాన్ఫోర్డ్ పరిశోధన ఆధారంగా పలు నివేదికలు రూపొందాయి, పలు డాక్యుమెంటరీలు రూపొందాయి. గత ఏడాది ఒక హాలీవుడ్ చిత్రం కూడా విడుదలైంది. ఈ పరిశోధన ఆధారంగా అమెరికాలో ఖైదీలను విచారించే తీరులోనూ, వారిని జైల్లో ఉంచే పద్ధతులలోనూ పలు మార్పులను తీసుకువచ్చారు. కానీ అధికారులు కఠినాతికఠినంగా ప్రవర్తించే ప్రతిసారీ ఈ పరిశోధన గుర్తుకురాక మానదు.

 

- నిర్జర.