శ్రీలక్ష్మి విచారణ: కేంద్రం మరో అస్త్రం..?

 

కేంద్రం ఈ రోజు ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్ కు అనుమతి మంజూరు చేయడంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి హయంలో ఒక వెలుగు వెలిగి చక్రం తిప్పిన రాజకీయ నాయకులలో, ప్రభుత్వ అధికారులలో మళ్ళీ కలవరం మొదలయింది. గనుల శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన శ్రీలక్ష్మి ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ఉదారంగా గనుల త్రవ్వకాలకి అనుమతులు మంజూరు చేసినందున ఆమె జైలు పాలయ్యారు.

 

ఆమె కొద్ది నెలల క్రితం బెయిలు కోసం దరఖాస్తు చేసుకొన్నపుడు, తానూ కేవలం ప్రభుత్వాదేశాలను తూచా తప్పకుండా అమలు జేసానే తప్ప, తనంతట తానుగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని, గాలి జనార్ధన్ రెడ్డి సంస్థలకి గనుల త్రవ్వకాలకి అనుమతులు జారీ చేయాలని పైనుండి వచ్చిన ఆదేశాలను ప్రభుత్వాదికారిగా అమలుచేయడం వల్లనే నేడు తనకీ దుస్థితి కలిగిందని ఆమె కోర్టులో విలపించారు కూడా. అయితే, కోర్టులు వ్యక్తుల భావోద్వేగాలను కాక సాక్ష్యాలనే ప్రామాణికంగా తీసుకొంటాయి గనుక ఆమె నిస్సహాయతను అర్ధం చేసుకొన్నపటికీ, ఆమెపై కేసు మాత్రం కొనసాగించాయి.

 

వైయస్. రాజశేఖర్ రెడ్డి సూచనలు లేదా సలహాల మేరకు శ్రీలక్ష్మి వ్యవహరించినందున ఆమెకు ఓబులాపురం గనుల అక్రమ త్రవ్వకాలలో గాలి జనార్ధన్ రెడ్డి కాకుండా ఇంకా లబ్ది పొందినవారి వివరాలు కూడా సహజంగానే తెలిసి ఉంటాయి, గనుకనే ఆమెను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరుతోంది. కేంద్రం ఈ రోజు అందుకు అనుమతించడంతో నేడో రేపో సీబీఐ ఆమెకు సమన్లు జారీ చేయవచ్చును. ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటపడుతుందా లేదా? అనే విషయాన్నీ పక్కన పెడితే, విచారణలో ఆమె ఇంకా ఎవరిరెవరి పేర్లు బయటపెడతారోనని ఈ గనుల కుంభకోణంలో ‘తీర్ధ ప్రసాదాలు’ స్వీకరించిన వారందరూ ఇప్పుడు బెంగ పెట్టుకొన్నారు.

 

ఈ వ్యవహారం యావత్తు దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి హయంలోనే జరిగింది గనుక, తొలుత కాంగ్రెస్ పార్టీలో పెద్దలు, ఆతరువాత వైయస్ కుటుంబ సభ్యుల పేర్లు బయటపడే అవకాశం ఉంది.

 

ఓబులాపురం కేసు కధ ఇంకా కోర్టుల్లో నలుగుతున్నందున దోషుల పేర్ల పట్టిక ఇంకా బయటపడనప్పటికీ, కేంద్రం గనుల అక్రమార్కుల పేర్లు తెలుసుకోలేనంత అమయుకురాలు కాదు. అందువల్ల కేంద్రం శ్రీలక్ష్మిని విచారించేందుకు కాకతాళీయంగా అనుమతినిచ్చినట్లు పైకి కనిపిస్తున్నపటికీ, ఇంకా లోతయిన కారణాలతోనే అనుమతినిచ్చి ఉండవచ్చును. తెలంగాణా అంశం మరియు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పార్టీలో, విపక్షంలో తనను ఇబ్బందిపెడుతున్న కొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వాధికారులను దారికి తెచ్చుకొనే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ‘శ్రీలక్ష్మిని విచారించేందుకు తగిన సమయంగా’ భావించి ఈ విధంగా ‘తగిన నిర్ణయం’ తీసుకొని ఉండవచ్చును.

 

బహుశః కేంద్రం అమ్ములపొదిలో ఇటువంటి అస్త్రాలు చాలానే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. రానున్న రోజుల్లో శ్రీలక్ష్మి బయట పెట్టే వ్యక్తుల పేర్లను బట్టి కేంద్రం ఎవరిమీదకి ఈ బాణం ప్రయోగించిందో అర్ధం అవుతుంది.