శ్రీలక్ష్మికి సుప్రీం షాక్
Published on: Mon Apr 2, 2012 2:12PM
హై
దరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. బెయిల్ పిటిషన్పై ట్రయిల్ కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు శ్రీలక్ష్మికి సూచించింది. ఇప్పటికే పలుమార్లు శ్రీలక్ష్మి బెయిల్ పిటీషన్లను కోర్టు తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో శ్రీలక్ష్మి పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదిలావుంటే... అక్రమ మైనింగ్ కేసుతోపాటు ఆమెను జగన్ ఆస్తుల కేసులోనూ సీబీఐ విచారిస్తున్నట్లు సమాచారం. కాగ్ నివేదికలో పెద్ద ఎత్తున భూ పందేరం జరిగిందంటూ వివరాలు బయటికి రావడంతో సీబీఐ ఇపుడు వాటిని ఆధారంగా చేసుకుని తీగ లాగుతున్నట్లు సమాచారం.
కాగా, వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఆడిటర్ విజయ సాయిరెడ్డి సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ చార్జ్‌షీట్‌లో తనపై తప్పుడు అభియోగాలు మోపిందని, తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సిబిఐ ఉహించుకుని తనపై అరోపణలు చేస్తుందని, ఎమ్మెల్యే శంకర్రావు వేసిన పిటిషన్ పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే వేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని విజయసాయిరెడ్డి కోర్టుకు తెలిపారు. దివంగత నేత వైఎస్ఆర్ వద్ద తాను ఆడిటర్‌గా విధులు నిర్వహించానని ఆయన మరణానంతరం ఆయన కుమారుడు జగన్ వద్ద ఆడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగన్‌తో కలిసి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డట్లుగా సిబిఐ పేర్కొన్నదంతా నిరాధారమని ప్రత్యేక కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది.


