ఈ రాద్ధాంతం కూడా కాంగ్రెస్ వ్యూహమేనా

 

ఊహించినట్లుగానే టీ-కాంగ్రెస్ నేతలు అందరూ శ్రీధర్‌బాబు మంత్రిత్వశాఖ మార్పుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో వీ.హనుమంత రావు నిర్వహిస్తున్నఇందిరమ్మ విజయయాత్రలో పాల్గొనెందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాను, మంత్రి శ్రీధర్‌బాబుతో సహా తెలంగాణా నేతలందరూ కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పిర్యాదు చేసారు. ఆయన ముఖ్యమంత్రిని మందలిస్తున్నట్లు ఏమయినా చెప్తారేమోనని వారు భావిస్తే, కుంతియా ‘ముఖ్యమంత్రికి తన మంత్రుల శాఖలను మార్చేస్వేచ్చ,అధికారం ఉంటుందని’ చెప్పడంతో షాక్ తిన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి నిరసనగా వారందరూ మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని భావిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను చూసిన మంత్రి టీజీ వెంకటేష్, “ఒకవేళ ముఖ్యమంత్రి నిర్ణయం వారికి నచ్చకపోతే రాజీనామా చేయడమే మేలు” అంటూ వ్యాఖ్యలు చేయడం వారికి పుండు మీద కారం చల్లినట్లయింది. ఇక కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా కలుగజేసుకొంటూ ఇటువంటి సమయంలో మంత్రిత్వ శాఖలు మార్చడం సబబు కాదు. అయినా శాఖలు మార్చిననత మాత్రాన్న తెలంగాణా ఏర్పాటు ఆగిపోతుందని భావించడం అవివేకం, అని మీడియాతో అన్నారు.

 

రేపు శాసనసభలో అందరూ కలిసి కట్టుగా ముఖ్యమంత్రిని, ఆయన సహచరులను గట్టిగా డ్డీ కొనవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో మంత్రి శైలజానాథ్ ప్రతిపాదించనున్న సమైక్యతీర్మానాన్నిఎట్టి పరిస్థితుల్లో సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకొంటామని టీ-కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సమైక్యతీర్మానం చేసిన తరువాతనే తెలంగాణా బిల్లుపై చర్చకు అంగీకరిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్, వైకాపా సభ్యులు కూడా అంతే ఖరాఖండిగా చెపుతున్నారు. అంటే శాసనసభలో బిల్లుపై ఇక ఎటువంటి చర్చజరగకుండానే జనవరి23 రాష్ట్రపతికి తిప్పి పంపే అవకాశాలే ఎక్కువని స్పష్టం అవుతోంది. బిల్లుపై సభలో ఎలాగు చర్చ జరిగే అవకాశం లేదు గనుక, తక్షణమే దానిని రాష్ట్రపతికి తిప్పి పంపమని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు రేపు గట్టిగా పట్టుబట్టడం ఖాయం. కానీ, ముఖ్యమంత్రి దానిని జనవరి23 గడువు వరకు ఇక్కడే ఆపడం కూడా అంతే ఖాయం. ఈ కాంగ్రెస్ నేతల డ్రామాలన్నీచూస్తుంటే తెలంగాణా బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పుడు దానిని ఎటువంటి చర్చ జరగకుండా, వ్యతిరేఖ ముద్ర పడకుండా ఏవిధంగా రాష్ట్రపతికి తిప్పి పంపాలో అంతా ముందే ప్లాన్ తయారు చేసుకొని అందరూ దాని ప్రకారమే నటించేస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే జైపాల్ రెడ్డి మొదలు టీజీ వెంకటేష్ వరకు అందరూ కలిసి ఇంత రాద్ధాంతం చేయవలసిన సమస్య కాదిది.