శ్రీ లంక సమస్యపై తమిళ పార్టీల రాజకీయ చదరంగం

 

రెండు నెలల క్రితం కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాను తన స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విడుదల చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే. పాము-ముంగీసల వంటి ఆజన్మ శత్రుత్వం ఉన్న డీయంకె పార్టీ అధ్యక్షుడు కరుణానిధి, ఏఐఏ డీయంకె పార్టీ అధ్యక్షురాలు మరియు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితల మద్య జరిగే రాజకీయ పోరాటాలలో ఇటువంటివారు అనేకమంది బలయిపోతూనే ఉంటారక్కడ.

 

ఇటీవల డీయంకె పార్టీ అధ్యక్షుడు కరుణానిధి శ్రీ లంక సమస్యను సాకుగా చేసుకొని యుపీఏ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో, రాష్ట్రంలో ఆయన పార్టీకి అనుకూలంగా రేటింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. పార్లమెంటు ఎన్నికలు దగ్గిరపడుతున్నఈ సమయంలో పూర్తిగా అణచివేశాననుకొన్న డీయంకె పార్టీ మళ్ళీ అనూహ్యంగా బలం పుంజుకోవడంతో అప్రమ్మత్తమయిన జయలలిత, వెంటనే దానికి విరుగుడు మంత్రం వేశారు.

 

త్వరలో చెన్నైల్ లో జరుగనున్న ఐపియల్ మ్యాచులో శ్రీ లంక క్రికెట్ ఆటగాళ్లను తమ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు అనుమతి ఇస్తే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో వారికి బద్రత కల్పించడం కష్టం అవుతుంది కనుక, వారిని చెన్నై మ్యాచులో పాల్గొనకుండా నిషేదించాలని కోరుతూ జయలలిత ప్రధాని డా. మన్మోహన్ సింగుకు ఒక లేఖ వ్రాసారు.

 

డీయంకె పార్టీ మద్దతు ఉపసంహరణతో చిక్కులో పడ్డ యుపీయే ప్రభుత్వానికి, ఇంతవరకు బయట నుండి మద్దతు ఇస్తున్నసమాజ్ వాది పార్టీ కూడా క్రమంగా దూరమవుతున్న సూచనలు స్పష్టంగా కనబడటంతో, ప్రభుత్వం పడిపోకుండా ఉండాలంటే మరొక పార్టీ మద్దతు వెంటనే అత్యవసరం. కనుక, ఊహించని విధంగా జయలలిత నుండి వచ్చిన లేఖను ఒక అపూర్వ అవకాశంగా అందుకొన్న యుపీయే ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందిస్తూ బీసీసీఐ తో ఒక ప్రకటన కూడా చేయించింది. తద్వారా జయలలితను ప్రసన్నం చేసుకొని ఆమె పార్టీ మద్దతు పొందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. డీయంకె పార్టీ కేంద్రాన్ని విరోధించి గనుక, జయలలిత తప్పకుండా తమ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

 

అయితే, ఈ రెండు పార్టీలు కోడెద్దులా రాజకీయ పోరాటాలు చేస్తుంటే వాటి మద్య శ్రీ లంక తమిళ ప్రజలు మొదలుకొని క్రీడాకారుల వరకు అందరూ లేగ దూడలా నలిగిపోతుండటమే చాల బాధాకరం. నిజం చెప్పాలంటే శ్రీ లంక తమిళుల సమస్య ఈ నాటిది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఉన్నదే. ఒకనాడు యల్.టీ.టీ.యి. నాయకుడు ప్రభాకరన్ చేతిలో అనేక మంది అమాయకులయిన తమిళులు ధన, మాన, ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు శ్రీ లంక ఆర్మీ చేతుల్లో కోల్పోతున్నారు.

 

ఈ రోజు వారికోసం వీదులకెక్కి పోరాటాలు మొదలుపెట్టిన రెండు తమిళ పార్టీలు ఏనాడు కూడా పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడలేదు సరికదా, అదే అంశం పట్టుకొని ఇద్దరూ రాజాకీయ లబ్ది పొందారు, ఇంకా ఇప్పటికీ పొందాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 

గత శాసన సభ ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలయిన డీయంకె పార్టీకి నాటినుండి అనేక కష్టాలు చుట్టుముట్టాయి. కరుణానిధి కుమార్తె కనిమోలి, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఎ.రాజా అరెస్టులు, మరో వైపు జయలలిత రాజకీయ కక్ష సాదింపులు, కరుణానిధి ఇద్దరు కొడుకులు అళగిరి, స్టాలిన్ ల మద్య పార్టీ పీఠంకోసం పోరాటాలు వంటి అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కరుణానిధి, మంచి ప్రతిఫలం అందించే శ్రీ లంక సమస్యను ఎత్తుకొని, రాష్ట్ర రాజకీయాలలో పార్టీ పరిస్థితిని చక్కబెట్టాలని పన్నిన వ్యూహం కొంత మేరకు సత్ఫలితాలు ఇచ్చినట్లే కనిపిస్తోంది.

 

కరుణానిధి తన వ్యుహాలతో ముందుకు సాగిపోతుంటే ఆయనను తీవ్రంగా వ్యతిరేఖించడమే తన పార్టీ సిద్ధాంతంగా చేసుకొన్న జయలలిత చేతులు ముడుచుకొని కూర్చోరు గనుక, ఆమె కూడా అందివచ్చిన ఐపియల్ మ్యాచులతో ఆట మొదలుపెట్టేసారు.

 

డీ.యం.కే.పార్టీ ఐక్యారాజ్య సమితిలో మానవ హక్కుల సదస్సులో శ్రీ లంకకు వ్యతిరేఖంగా భారత్ ఓటేయాలని డిమాండ్ చేస్తే, త్వరలో శ్రీ లంకలో జరుగనున్న కామన్వెల్త్ అధినేతల సమావేశాలను బహిష్కరించాలని జయలలిత డిమాండ్ చేసారు.

 

తమిళ ప్రజల సున్నితమయిన భావోద్వేగాల నుండి రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నంలో యల్.టీ.టీ.యి. మరియు శ్రీ లంక ఆర్మీల కంటే కూడా చాల దారుణంగా శ్రీ లంక తమిళుల సమస్యలతో ఈ రెండు తమిళ పార్టీలు ఆడుకొంటున్నాయిప్పుడు. సాటి తమిళులు కష్టాలలో ఉంటే వారిని ఏవిధంగా ఆదుకోవాలో ఆలోచించాల్సిన ఈ రెండు తమిళ పార్టీలు అదే అంశం మీద రాజకీయ చదరంగం ఆడుకోవడం చాలా హేయమయిన చర్య.

 

ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, మన జాతీయ నాయకులెవరూ కూడా ఇంతవరకు వీరి ఆటలను ఖండించలేదు. ఎందుకంటే రానున్న ఎన్నికల తరువాత వారి అవసరం పడవచ్చునని దురాలోచనతో వెనుకంజ వేస్తున్నారు.

 

ఇంత కంటే మరో దారుణమయిన విషయం ఏమిటంటే, జాతీయ మీడియా శ్రీ లంక తమిళుల సమస్య కేవలం తమిళనాడుకు మాత్రమే చెందిన సమస్యగా భావిస్తూ, శ్రీ లంకలో ఆర్మీ చేతిలో ధన, మాన, ప్రాణాలు కోల్పోతున్న వారిపట్ల కనీస మానవధర్మం పాటించక నిర్లక్ష్యం వహించడం. జాతీయ మీడియాకు దక్షిణ భారతదేశం మీద మొదటినుండి చిన్న చూపే ఉంది. అందుకే శ్రీ లంక తమిళుల సమస్యల పట్ల స్పందించక పోయినప్పటికీ, జయలలిత ఐపియల్ క్రికెట్ మ్యాచులకు అడ్డం పడటం గురించి మాత్రం చాల పెద్ద చర్చలే చేస్తున్నాయి.

 

ఈ పరిణామాలన్నీ మనుషుల్లో నానాటికి మానవత్వం, నైతిక విలువలు కనుమరుగవుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.