విజయవాడ మెట్రో రైలు మార్గం ఖరారు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో మూడు మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించ తలపెట్టింది. అందుకోసం మెట్రో రైల్ నిర్మాణంలో ఉండే సాధకబాధకాల గురించి బాగా ఎరిగిన శ్రీధరన్ న్ను సలహాదారుగా నియమించుకొంది. ఆయన డిల్లీలో మెట్రో రైలు ప్రాజెక్టు సకాలంలో విజయవంతంగా పూర్తిచేసి అందరి మన్ననలు అందుకొన్నారు. అటువంటి అనుభవజ్ఞుడు, దీక్షాదక్షతలు గల వ్యక్తిని సలహాదారుడిగా నియమించుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి కనబరిచారు. ఆయన నిర్ణయం తప్పు కాదని శ్రీధరన్ తన తొలి పర్యటనలోనే నిరూపించారు. ఈరోజు విజయవాడ, మంగళగిరి, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలో స్థానిక అధికారులతో కలిసి పర్యటించిన ఆయన అన్ని విషయాలు చాలా నిశితంగా పరిశీలించిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమయిన విషయాలు తెలిపారు.

 

1. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న మెట్రో రైళ్ళు ఏవీ కూడా లాభాలలో నడవటం లేదు. కేవలం సేవా భావంతోనే నడుపుతున్నారు. కనుక ఈ ప్రాజెక్టుపై కూడా ఏవో లాభాలు వస్తాయని అశించవసరం లేదు.

 

2. మెట్రో రైలును నగరాలలో అంతర్గత రవాణా మాధ్యమంగానే చూడాలి తప్ప, వివిధ నగరాలు పట్టణాల మధ్య రవాణాకుపనికిరాదు. కారణం ఒక్క కిమీ మెట్రో రైలు నిర్మాణానికి దాదాపు రూ.400కోట్లు ఖర్చుతాయి. అందువల్ల ఈ మెట్రో ప్రాజెక్టు ఆర్ధికంగా చాలా భారమయినదే. కనుక విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి (వీ.జీ.టీ.యం.)ప్రాంతాలను కలుపుతూ స్థానిక అధికారులు సిద్దం చేసిన మెట్రో ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కానివని తేల్చి చెప్పారు.

 

3. విజయవాడలో చెప్పట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు రెండు దశలలో, కేవలం మూడు సం.లలో పూర్తి చేసేందుకు కృషి చేస్తాము. మొదటి దశలో కానూరు వద్ద సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాల నుండి నెహ్రూ బస్టాండ్ వరకు అక్కడి నుండి మళ్ళీ రామవరప్పాడు మీదుగా హైవే రోడ్డు వరకు మొత్తం 26కిమీ. మెట్రో రైల్ నిర్మిస్తామని తెలిపారు. మొదటి దశ పూర్తయిన తరువాత రెండవ దశ గురించి ఆలోచిస్తామని తెలిపారు.

 

4. నగరం మధ్యగా సాగే ఈ ప్రాజెక్టు కోసం అతి తక్కువ భూసేకరణతో పని పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతీ ఒక కిమీకు ఒక మెట్రో స్టేషన్ ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

5. ఈ ప్రాజెక్టుపై పూర్తి నివేదిక(డీ.పీ.యస్.)ను 2015 జనవరి నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, ప్రభుత్వ ఆమోదం తీసుకొన్న తరువాత దానిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి దాని ఆమోదం పొందిన తరువాత ఐదారు నెలలలోనే నిర్మాణపనులు మొదలు పెట్టి మూడేళ్ళలోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

 

6. వైజాగ్, తిరుపతి నగరాలలో కూడా త్వరలోనే పర్యటించి ఇదే విధంగా ప్రాధమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

 

ఈ ప్రాజెక్టులను సాధ్యమయినంత త్వరగా మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను కోరినట్లు శ్రీధరన్ మీడియాకు తెలిపారు. శ్రీధరన్ తన తొలి పర్యటనలోనే వీ.జీ.టీ.యం. పరిధిలో నాలుగు ప్రాంతాలను కలుపుతూ మెట్రో నిర్మిస్తే అది ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని హెచ్చరించడం వలన విలువయిన ప్రజాధనం వృధా కాకుండా అరికట్టగలిగారు. అదే విధంగా మెట్రో నిర్మాణం లాభాప్రధం కాదనే సంగతిని ఆయన చాల నిష్కర్షగా చెప్పడం విశేషమే. అందువలన ఇకపై ప్రభుత్వం కూడా కొత్తగా మెట్రో రైల్ నిర్మాణం గురించికా, ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు తగు ప్రణాళికలు సిద్దం చేసుకోగలుగుతుంది. రాజధాని నిర్మాణం కోసం మాష్టర్ ప్లాన్ సిద్దమయిన తరువాతనే రెండవ దశ మెట్రో రైలు మార్గం ఖరారు చేసుకోవడం మంచిదనే ఆయన సూచన చాలా ఆలోచించదగ్గదే.