బొత్స పార్టీని వదులుకొంటారా..మద్యం వ్యాపారాలనా?

 

విజయవాడ స్వర్ణా బార్ లో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు చనిపోయిన వెంటనే హడావుడిగా అక్కడ వాలిపోయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం విధించాలని డిమాండ్ చేసారు. దానిని అమలు చేసే అవకాశం ముందుగా చంద్రబాబు నాయుడుకే ఇస్తున్నామని, ఒకవేళ ఆయన వలన కాకపోతే తమ పార్టీ అధికారంలోకి రాగానే తాము అమలుచేస్తామని ప్రకటించేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తామని హెచ్చరించారు.

 

ఆయన తెదేపా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నంలో తమ స్వంత పార్టీ నేతలనే ఇబ్బందికర పరిస్థితులోకి నెట్టేరు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ వంటి అనేక మంది నేతలకు మద్యం వ్యాపారాలున్నాయి. అందుకే వారెవరూ ఈ సంఘటనపై నోరు విప్పి మాట్లాడే సాహసం చేయలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే మద్యపాన నిషేధం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే, బొత్స సత్యనారాయణ వంటివారు అనేక మంది వైకాపాను వీడే అవకాశం ఉంటుంది. వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి పార్టీలో నేతలు ఎవరూ మద్యం వ్యాపారం చేయకూడదని సూచించారు. అంటే మద్యం వ్యాపారం చేస్తున్న బొత్స సత్యనారాయణ వంటి నేతలకే ఆ హెచ్చరిక అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదని భావించి ఆయన వైకాపాలో చేరితే. ఊహించని విధంగా జగన్ కూడా షాక్ ఇస్తున్నారిప్పుడు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూమద్యనిషేధం అమలు చేయదు కనుక వారికీ ప్రభుత్వం తరపున ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ స్వంత పార్టీ తరపునుండే సమస్య ఎదురవుతుండటం విచిత్రం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu