చట్ట సభల నిర్ణయాల పై కోర్టుల జోక్యం సరికాదు.. స్పీకర్ తమ్మినేని

ఆంధ్రప్రదేశ్ ‌లో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులకు సంబంధించి శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ బిల్లులపై సభలో 11 గంటల పాటు చర్చించామన్నారు. ఇందులో ప్రతిపక్ష పార్టీకి రెండు గంటలకు పైగా చర్చించేందుకు సమయం ఇచ్చామన్నారు. అంతే కాకుండా టీడీపీకి ఉన్న సంఖ్యాబలం కంటే కూడా వారికి ఎక్కువ సమయం ఇచ్చామని అయన తెలిపారు. ఐతే ఈ బిల్లులపై అసలు చర్చ జరగలేదని టీడీపీ అనడం సరికాదని అయన అన్నారు. పార్లమెంట్, శాసనసభలలో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం కూడ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదని చెబుతూ, 1997 సంవత్సరంలో అప్పటి శాసన సభ స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చారని, మరి శాసనసభ తీసుకొనే నిర్ణయాలపై కోర్టులకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు..

 

ఇదే సందర్భంలో ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలిలోకి రాకూడదనడం ఎంతవరకు సమంజసమని తమ్మినేని టీడీపీని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలికి రాకూడదు అని కొందరు వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ అని అయన అన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు సెలక్ట్ కమిటీలో ఉన్నాయంటూ కొందరు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తమ్మినేని అన్నారు. అసలు సెలక్ట్ కమిటీనే ఏర్పాటు చేయనప్పుడు ఆ బిల్లులు పెండింగ్‌లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే ఓటింగ్ కచ్చితంగా జరగాలని, కానీ అలా జరగనప్పుడు సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటు అవుతుందని ఆయన ప్రశ్నించారు. అసలు సెలక్ట్ కమిటీకి పంపాలని శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు అడగలేదని తమ్మినేని నిలదీశారు. రాజధానిని ఫ్రీ జోన్ గా చేస్తామని వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.