ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. ఇక మిగిలింది ఇద్దరే!

posted on: Feb 4, 2026 12:14PM

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు భారీ ఊరట లభించింది. ఆయన పార్టీ మారారు అనేందుకు  సరైన ఆధారాలు లేవని  తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్  పేర్కొంటూ.. ఆయనపై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేశారు.   దీంతో పార్టీ ఫిరాయింపు విషయంలో పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లైంది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో మాత్రమే స్పీకర్ తన తీర్పు వెలువరించాల్సి ఉంది.  గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి ఫిరాయించినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.  కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒకరి తరువాత ఒకరిగా ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించి తీర్పులు వెలువరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించారనడానికి ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పటి వరకూ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది విషయంలో వారు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవంటూ తీర్పులు వెలువరించారు.

ఇక స్పీకర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలా ఉండగా సుప్రీం కోర్టు స్పీకర్ ను నిర్దుష్టగడువులోగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆదేశించింది.  ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది స్పీకర్ విచక్షణే.   ఎందుకంటే బీఆర్ఎస్ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని మాత్రమే సుప్రీం ను ఆదేశించింది.

ఆయన నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని మాత్రమే బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరింది. ఆ మేరకే సుప్రీం కోర్టు కూడా గవర్నర్ నిర్దుష్టగడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.  ఇక స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ కు అభ్యంతరాలు ఉంటే ఆ పార్టీ సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...