Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏప్రిల్ నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు!
posted on: Feb 17, 2026 10:11AM

నెరవేరనున్న ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ
ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ జోన్ కార్యాలయం ఏప్రిల్ నుంచి పనిచేసే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. విశాఖకు కేంద్రం కొత్త రైల్వే జోన్ ప్రకటించినా, పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడంలో తాత్సారం చేస్తూ వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌గా సందీప్ మాధుర్‌ను గత ఏడాది జూన్‌లో కేంద్రం నియమించింది. అలాగే సిరిపురంలో వీఎంఆర్‌డీఏ డెక్‌లో రెండు అంతస్థుల భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని సిద్ధం చేసింది. పదుల సంఖ్యలో అధికారుల నియామకాలు కూడా జరిగాయి. మరోవైపు ముడసరలోవలో రూ.172 కోట్లతో పనులు జరుగుతున్నాయి.
ఈ కొత్త జోన్ ఆపరేషన్ మొదలు కావాలంటే గెజిట్ నోటిఫికేషన్ రావాలి. దానిని జారీ చేయడంలో రైల్వే బోర్డు జాప్యం చేస్తోంది. విశాఖ ఎంపీ శ్రీభరత్ పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుతున్నారు. విజయదశమి అని ఒకసారి, సంక్రాంతి అని మరోసారి తేదీలు ప్రకటించడం కూడా జరిగింది. కానీ గెజిట్ నోటిఫకేషన్ రాలేదు. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు రైల్వేజోన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో రైల్వే బోర్డు అధికారులు మూడు రోజుల కిందట.. అంటే శుక్రవారం సాయంత్రం మూడు రైల్వే జోన్లు... తూర్పు కోస్తా, దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా-విశాఖపట్నం... జనరల్ మేనేజర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
కొత్తజోన్ ఏర్పాటు నేపథ్యంలో కొత్త డివిజన్ల ఏర్పాటు, సిబ్బంది సర్దుబాటు, బదిలీలు, నియామకాలపై చర్చించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విశాఖలో దక్షిణ కోస్తా జోన్ కార్యాలయం పనిచేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ జోన్‌పై కేంద్రం వద్ద ఉన్న సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం రైల్వే లైన్లు, స్టేషన్ల మార్పు, అధికారులు, సిబ్బంది బదిలీలు జరగనున్నాయి. అధికారుల కొరత ఉండడంతో తూర్పు కోస్తా రైల్వే అధికారులు గత కొద్దికాలంగా పదవీ విరమణ చేసిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. రైల్వేలో 65 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉండడంతో కనీసం ఏడాది పనిచేసే అవకాశం ఉన్నవారందరినీ తీసుకోవడానికి యత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే నెలలో గెజిట్ నోటిఫికేషన్ వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే జోన్‌లో వాల్తేరు డివిజన్ విశాఖపట్నం డివిజన్‌గా పేరు మార్చుకుని కొనసాగుతుంది. దాంతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉంటాయి. ఒడిశాకు చెందిన ప్రాంతాలన్నీ కొత్తగా ఏర్పాటుచేసే రాయగడ డివిజన్ (తూర్పు కోస్తా)లోకి వెళ్లిపోతాయి. కొత్తవలస నుంచి అరకులోయ వరకూ మార్గం అంతా రాయగడ డివిజన్‌లో చేర్చారు.



.webp)


