Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ తో భేటీకి సోనియా నో.. తెలంగాణ సీఎంకు ఎక్కడా దొరకని ఆసరా!
posted on: May 24, 2022 5:11PM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయ ప్రవేశం ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి చందంలా సాగుతున్నాయి. ఆయన ఇటీవల దేశ వ్యాప్త పర్యటన అంటూ చేపట్టిన టూర్ ఒక ఫార్స్ గా మారింది.
జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ ఆయన చేసిన ప్రయత్నంతో బీజేపీతో పూర్తిగా తెగదెంపులు అయిపోయింది. ఇక మళ్లీ బీజేపీతో సంబంధాలు రివైవ్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ దరి చేరాలని భావించినా బీజేపీ దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయన కాంగ్రెస్ కు చేరువ కావడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టినట్లు చెబుతున్నారు.
తన హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయని చెబుతున్నారు. కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం సోనియా గాంధీతో భేటీ కోసం ఆయన ప్రయత్నించారు, ఆ సమాచారాన్ని కాంగ్రెస్ లోని తన పరిచయస్తుల ద్వారా ఆమెకు చేరవేశారు. అయతే కేసీఆర్ తో భేటీకి సోనియా తిరస్కరించారు. సోనియా గాంధీని కలసి రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపితే తాను బేషరతుగా మద్దతు ఇస్తానని కేసీఆర్ ఆమెకు తెలియ జేయాలని భావించినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ తో భేటీకి సోనియా నిరాకరించారనీ ఆ వర్గాలు తెలిపాయి.
ఇంత కాలం కాంగ్రెస్ లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు, తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సకుటుంబంగా సోనియా గాంధీని కలిసి పార్టీని విలీనం చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించిన సంఘటనలపై సోనియా ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ వర్గాల సమాచారం. ఆ కారణంగానే కేసీఆర్ తో భేటికీ ఆమె ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఇటు బీజేపీతోనూ, అటు కాంగ్రెస్ తోనూ చెడి ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయ ఎరీనాపై ఒంటరిగా నిలబడిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన జాతీయ అజెండాకు మద్దతు లభించే అవకాశాలు ఇసుమంతైనా లేవంటున్నారు. జాతీయ అజెండా సంగతి అటుంచితే.. ఇటు తెలంగాణలోనే ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక రాష్ట్ర పర్యటనకు గురువారం రానున్న ప్రధాని నరేంద్ర మోడీని అవాయిడ్ చేసేందుకు ఏ పర్యటన పెట్టుకుంటారని బీజేపీ ఎద్దేవా చేస్తున్న పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. తన కుమారుడికి రాష్ట్రాన్ని అప్పగించి తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న అకాంక్షను సాకారం చేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొటొక్కటిగా విఫలం కావడంతో రాష్ట్రంలో కూడా ఆ పార్టీ నేతల జోరు మందగించింది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. దానిని అధిగమింయి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆయన తన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న బిల్డప్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ జోరు తగ్గింది. విపక్షాల విమర్శలకు గతంలోలా టీఆర్ఎస్ శ్రేణులు దీటుగా బదులివ్వలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఇంత కాలం టీఆర్ఎస్ బలోపేతానికి దోహదపడిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో బలహీన పడేందుకు హేతువౌతోందని పరిశీలకులు అంటున్నారు. నల్లాల ఓదెలు బాటలో మరింత మంది కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. కారు పార్టీలో అసమ్మతులకు గాలం వేయడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. పార్టీ వీడే వారిని ఆపలేక, పార్టీలోకి వచ్చే వారు ఎవరూ కనిపించక టీఆర్ఎస్ గత ప్రాభవాన్ని కోల్పోయిందంటున్నారు. పార్టీలో కర్త, కర్త, క్రియా అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితికి కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తన దేశ వ్యాప్త పర్యటనను అర్ధంతరంగా ముగించుకు వచ్చిన తరువాత ఇప్పటి వరకూ కనీసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడమే కేసీఆర్ డీలా పడ్డారనడానికి తార్కానమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.






