ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎలా పోటీచేస్తావ్ పవన్?

 

టీడీపీపై,చంద్రబాబుపై ఎవరైనా విమర్శలు చేస్తే అసలు సహించరు,మాటకి మాట తిప్పికొట్టటంలో ముందుంటారు.ఆయనే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.తాజాగా పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్  పై కవాతు నిర్వహించి,అనంతరం నిర్వహించిన భహిరంగ సభలో లోకేష్ పై విమర్శలు చేశారు.దీనిపై సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎలా అవుతారంటూ పవన్ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ లెక్క ప్రకారం.. జిల్లా కలెక్టరుగా పని చేయాలంటే ముందు బిల్‌ కలెక్టరుగా పనిచేయాలేమోనని ఎద్దేవా చేశారు.ప్రజలు తనను సినిమా హీరోగా చూస్తున్నారా? లేక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా? అనేది పవన్‌కల్యాణ్‌ ఆలోచించుకోవాలని సోమిరెడ్డి సూచించారు.

ఓ వైపు అహింసావాదిని అంటారని..మరోసారి దెబ్బకు దెబ్బ తీయాలంటారని విమర్శించారు. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అయితే...యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌‌‌ అని అన్నారు. ప్రజారాజ్యం తర్వాత పవన్‌ జనసేన పార్టీ పెట్టారన్నారు. సీఎం పదవిపై ఆశ లేదని ఓసారి చెబుతారని.. మరోసారి ముఖ్యమంత్రి కావాలంటారని మంత్రి దుయ్యబట్టారు. తితలీ తుపానుతో ప్రజలు అల్లాడుతుంటే కవాతు చేస్తున్నారని...అసలు కవాతుకు అయిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌ కుమారుడు సీఎం కాకూడదా అని పవన్‌ ప్రశ్నించారని...ఛాయ్‌వాలాగా ఉన్న మోదీ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు.ఎస్టీ నియోజకవర్గం పాడేరు నుంచి పోటీ చేస్తానన్న పవన్‌కు రాజకీయ పరిజ్ఞానం ఉందా అని అన్నారు.తోలు తీస్తా.. తాట తీస్తా.. గోదాట్లో కలిపేస్తా.. ఈ తరహా భాష ఏ రాజకీయ పార్టీ ఉపయోగించదని.. ఈ భాషనే పవన్ తన మేనిఫెస్టోలో పెడతారా? అని ప్రశ్నించారు.వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడే పవన్..., తన అన్న వారసత్వం నుంచే తాను రాజకీయాల్లోకి రాలేదా అని ప్రశ్నించారు.మోడీతో జగన్-పవన్ ప్రయాణం ఖాయమైందని.. ఇది ప్రజల అభిప్రాయమని అన్నారు.