కేరళ సియం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

 

కేరళ సీఎం ఊమెన్ చాందీని సోలార్ ప్యానెల్ స్కాం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం చాందీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. చాందీ తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలంటూ ఎల్డీఎఫ్ సహా ప్రతిపక్షాలు అసెంబ్లీని స్తంబింపజేశాయి.

ఊమెన్‌ చాందీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అటు అసెంబ్లీని సైతం ప్రతిపక్షాలు అట్టుడుకించాయి. స్కాంలో నిందితులుగా ఉన్న సరితా నాయర్‌, రాధాక్రిష్ణన్‌, శాలు మీనన్‌తో సీఎం చాందీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించాయి.

ఎల్డీఎఫ్‌ కార్యకర్తలు అసెంబ్లీ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం చాందీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జితో నిరసనకారులను చెదరగొట్టారు.

అయితే పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన చాందీ విచారణకు అంగీకరించారు.. దానితో పాటు తప్పని సరి అయితే రాజీనామకు కూడా వెనుకాడనని ప్రకటించారు. ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన కొద్ది సేపటికే చాందీ మళ్లీ మాట మార్చారు.. ఆ కుంభకోణంతో తనకెలాంటి సంభందం లేదని ప్రస్థుతానిక రాజీనామా యోచన లేదని తేల్చేశారు దీంతో మరోసారి ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

కాంగ్రెస్‌ హైకమాండ్‌తో పాటు మిత్రపక్షమైన యుడీఎఫ్‌ కూడా మద్దతుగా నిలవటంతో చాందీ మాటర్చినట్టుగా భావిస్తున్నారు..అయితే ప్రస్థుతానికి గండం గట్టెక్కినా చాందీ చుట్టూ ఉచ్చు మరింత బలంగా బిగుసుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు..