పొగ తాగడం వల్ల ప్రపంచానికి ఎంత ఖర్చు?

‘సరదా సరదా సిగిరెట్టు...’ అంటూ రేలంగి కాలం నుంచీ పాటలు వింటున్నాం. గుప్పుగుప్పుమని పొగ మేఘాలను సృష్టించే అపర బ్రహ్మలను వీధి వీధినా చూస్తున్నాం. కాలం మారేకొద్దీ ఈ అలవాటు పెరుగుతోందే కానీ తరిగే సూచనలు కనిపించడం లేదు. సిగిరెట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుందనే హెచ్చరికలు ఒక ఎత్తు. కానీ అలా ఆరోగ్యం పాడవ్వడం వల్ల ఈ ప్రపంచానికి ఎంత ఆర్థిక నష్టం వాటిల్లుతోందో ఓ సర్వే నిర్వహించారు. దానిలో తేలే వాస్తవాలతో పరిశోధకుల దిమ్మ తిరిగిపోయింది...
7180000000000

 


పై సంఖ్యని ఓసారి లెక్కపెట్టి చూడండి. 7180 వందల కోట్లు! ప్రత్యక్షంగా, పరోక్షంగా పొగ తాగడం వల్ల ఈ ప్రపంచానికి కలుగుతున్న ఆర్థిక నష్టం ఇది. ఇందులో 40 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల భాగమే కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా BRIC దేశాలు అని సగర్వంగా చెప్పుకొనే బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా దేశాల వాటా ఇందులో 25 శాతమని తేల్చారు.

 


ఆరోగ్య ఖర్చులు- పని దినాలు
2012 సంవత్సరంలో 20 నుంచి 69 ఏళ్ల లోపు వయసువారి మరణాలలో, 12 శాతం కేవలం పొగ తాగడం వల్లేనని తేలింది. పొగాకు అలవాటుతో... అర్థంతర మరణాల వల్ల, రోగాలతో సతమతం కావడం వల్ల, ఆసుపత్రులలో చేరడం వల్లా రెండు కోట్లకు పైగా పనిదినాలు వృధా అయిపోతున్నాయి. దీని వల్ల ఉద్యోగరంగమూ, స్థూల జాతీయోత్పత్తి (GDP) కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు తేలింది.

 


ఇంతే కాదు!
పైన పేర్కొన్న లెక్కలు కేవలం పొగాకుని పొగ రూపంలో తాగేవారికి సంబంధించినవే. ఇక వాటిని నిరంతరం నమిలే గుట్కా రాయుళ్లని లెక్కలోకి తీసుకుంటే ఈ లెక్కలు చుక్కలు దాటేవంటున్నారు పరిశోధకులు. పైగా ఒకరు పొగ తాగుతుంటే పక్కనే ఉండి పీల్చడం వల్ల (సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌) ఏర్పడే నష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదట.

 

 

మేలుకోవాల్సిందే
పొగాకు వల్ల కలుగుతున్న ఆర్థిక నష్టం.. ప్రపంచ దేశాల GDPలో 2 శాతానికి సమానంగా ఉంది. ఇక ప్రపంచంలోని ఆరోగ్య ఖర్చులన్నీ కలిపితే అందులో 6 శాతానికి పొగాకే కారణం అవుతోంది. కాబట్టి ఇటు ఆరోగ్యాలనీ, అటు ఆర్థిక రంగాన్నీ అతలాకుతలం చేస్తున్న పొగాకు సమస్యని నియంత్రించి తీరాల్సిందే అంటున్నారు పరిశోధకులు. అందులో భాగంగా 2030 నాటికి పొగాకు వల్ల ఏర్పడే మరణాలను కనీసం మూడోవంతుకి తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. 

 

 

- నిర్జర.