ఎన్‌ఐఏకు సహకరించని సిట్

posted on: Jan 5, 2019 4:29PM

 

విశాఖపట్నం విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్‌ 25న వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఈనెల 1వతేదీన ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేసింది. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్‌  ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు పిటిషనర్లు కోరిన విధంగా కేంద్రం ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై ఇక విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. కేంద్రం సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎన్‌ఐఏ విచారణ ప్రారంభించింది.

కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఎన్‌ఐఏ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో జగన్‌పై హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన దర్యాప్తును నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో కేసు డాక్యుమెంట్లను, రికార్డులన్నింటినీ చట్ట నిబంధనల మేరకు ఎన్‌ఐఏకు అప్పగించాల్సి ఉంటుంది. కాగా ఎన్‌ఐఏ విచారణకు సిట్‌ సహకరించడం లేదట. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు వివరాలు ఇవ్వలేమని ఎన్‌ఐఏకు విశాఖ అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర  ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పీలుకు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...