పెళ్లి కూతురుపై కాల్పులు...బీహార్‌లో షాకింగ్ ఘటన

posted on: Feb 25, 2026 1:25PM

 

బీహార్‌లో ప్రేమ విఫలం కావడంతో పెళ్లి వేడుకలో కాల్పుల ఘటన సంచలనం రేపింది. బక్సర్ జిల్లాలోని చౌసా నగర్ పంచాయతీ పరిధిలోని మల్లాటోలా గ్రామంలో ఆరతి కుమారి (18) వివాహం ఘనంగా జరుగుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.పెళ్లి వేడుకల్లో భాగంగా వధూవరులు దండలు మార్చుకుంటుండగా, ముసుగు ధరించిన ఓ యువకుడు హఠాత్తుగా వేదికపైకి ఎక్కి వధువు కడుపులో తుపాకీతో కాల్పులు జరిపాడు. భారీ శబ్దాలతో మ్యూజిక్ కొనసాగుతుండటంతో కాల్పుల శబ్దం అక్కడివారికి స్పష్టంగా వినిపించలేదు. అయితే ఆరతి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో రక్తస్రావం గమనించిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

గాయపడిన యువతిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారణాసికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, దినబంధు అనే యువకుడు గత రెండేళ్లుగా ఆరతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. ఆమె పెళ్లి జరగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో కూడా ఒక పెళ్లి సంబంధాన్ని బెదిరింపులతో చెడగొట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు. కాల్పుల అనంతరం నిందితుడు పరారీలోకి వెళ్లగా, పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...