బీజేపీని కాదని శివసేన ఘోర తప్పిదమే చేసింది

 

మహారాష్ట్రలో శివసేన పార్టీ, బీజేపీతో జత కట్టి అధికారంలో భాగస్వామి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, పంతానికి పోయి ఆ సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకొని ప్రతిపక్షంలో కూర్చొంది. అందుకు ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ టాక్రేనే తప్పు పట్టవలసి ఉంటుంది. గత రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్న శివసేన పార్టీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన శక్తిని అతిగా ఊహించేసుకొని, బీజేపీతో సీట్ల సర్దుబాటుకు అంగీకరించకుండా ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి మొదటి తప్పు చేసింది. ఆ తరువాత బీజేపీకి 121 సీట్లతో అతిపెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతున్నప్పుడు, 63 సీట్లు గెలుచుకొన్న శివసేన దానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో అధికారం పంచుకోవచ్చును. అందుకు బీజేపీకూడా సానుకూలంగానే స్పందించింది. కానీ, ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలతో శివసేన తన నిర్ణయం మార్చుకొంది.

 

మహారాష్ట్ర ఎన్నికల తరువాత మళ్ళీ బీజేపీకి దగ్గరయిన శివసేనకు బీజేపీ రెండు కేంద్రమంత్రి పదవులు ఆఫర్ చేసింది. అందుకు శివసేన చాలా సంతోషించి ఉండాలి. కానీ ప్రధాని మోడీ శివసేనలో తనకు నచ్చిన సురేష్ ప్రభుకే కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపడంతో ఉద్దవ్ టాక్రేకు ఆగ్రహం కలిగించింది. అయినా మోడీ ఖాతరు చేయకుండా సురేష్ ప్రభుకే కేంద్రమంత్రి పదవి కట్టబెట్టడం, ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శివసేనకు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరడంతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ టాక్రే మరింత ఆగ్రహం చెందారు.

 

అందుకే తమ పార్టీ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోదని ప్రకటించడమే కాకుండా అన్నంత పని చేసి చూపించారు కూడా. ఈరోజు శాసనసభలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలనిరూపణ జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా తన పార్టీ సభ్యుల చేత ఓటు వేయించారు కూడా. దానితో ఇక ఆ రెండు పార్టీల మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లే అయ్యింది. అయితే దీనివలన శివసేన పార్టీయే ఎక్కువ నష్టపోయిందని, నష్టపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

శివసేన కొంచెం సంయమనం పాటించి ఉండి ఉంటే, కేంద్రంలో రెండు మంత్రి పదవులు నిలబెట్టుకోవడమే కాకుండా రాష్ట్రంలో కూడా అధికారంలో పాలుపంచుకోగలిగేది. కానీ పంతానికి పోయి గొప్ప సువర్ణావకాశం పోగొట్టుకొంది. కేంద్రంలో శివసేనకు చెందిన సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా ఉండి ఉంటే, పార్టీకి దక్కే గౌరవమే వేరుగా ఉండేది. కానీ తన పంతం కారణంగా అత్యంత కీలకమయిన రైల్వే శాఖను నిర్వహిస్తున్న సురేష్ ప్రభును బీజేపీకి వదులుకొంది.

 

అయితే శివసేన కష్టాలకు ఇది అంతం కాదు ఆరంభమేనని చెప్పక తప్పదు. ఏవిధంగా అంటే, గత పదిహేనేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న శివసేన, ఇప్పుడు మరో ఐదేళ్ళ వరకు ఎదురు చూడవలసి ఉంటుంది. ఆ తరువాత వచ్చే ఎన్నికలలో కూడా శివసేన ఖచ్చితంగా గెలుస్తుందని ఎవరూ చెప్పలేరు. అందువలన ఇక నుండి ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఒకరొకరుగా బీజేపీలో చేరడం మొదలుపెడితే, మిగిలినవారిని కాపాడుకోవడానికే శివసేనకు సరిపోతుంది.

 

ఇప్పటికే మహారాష్ట్రాలో చాల బలంగా ఉన్న బీజేపీ ఈ ఐదేళ్ళలో మరింత బలపడుతుంది. పనిలోపనిగా తను వ్యతిరేకించే పార్టీలను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసే ప్రయత్నం చేయవచ్చును కూడా. ఎప్పటికయినా మహారాష్ట్రాలో స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలుగంటున్న శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ టాక్రేకు ఈ పరిణామాలు తట్టుకొని నిలబడటం చాలా కష్టమేనని చెప్పక తప్పదు.