ఏ.పీ. రాజధానిపై తుది నివేదిక-వివరాలు

 

శివరామ కృష్ణన్ కమిటీ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై సమర్పించిన నివేదిక గురించి మీడియాలో వచ్చిన వార్తల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అసహనం వ్యక్తం చేసినప్పటికీ, నిన్న ఆ కమిటీ కేంద్రానికి సమర్పించిన తుది నివేదికలో ఇంచుమించు మీడియా పేర్కొన్న విషయాలే ఉండటంతో మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని స్పష్టమయింది. నిన్న ఆ కమిటీ కేంద్రానికి 187 పేజీలు గల తన తుది నివేదిక సమర్పించింది. దానిని నేడు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. సెప్టెంబర్ 1న సమావేశమవుతున్న రాష్ట్ర మంత్రివర్గం ఆ నివేదికపై చర్చించి తన నిర్ణయం ప్రకటిస్తుంది.

 

                                                      కమిటీ తన తుది నివేదికలో పేర్కొన్నవిషయాలు

విజయవాడ-గుంటూరు ప్రాంతం రాజధాని నిర్మాణానికి ఎంతమాత్రం అనువయినది కాదని స్పష్టం చేసింది. సారవంతమయిన పంట భూములపై రాజధాని నగరం నిర్మించడం ఎంత మాత్రం తగదని, దాని వలన దీర్ఘ కాలంలో ఆర్ధిక, పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదీగాక ప్రస్తుతం అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నందున భూసేకరణ కూడా ప్రభుత్వానికి చాలా ఆర్ధిక భారంగా మారుతుందని, ఒక్క భూసేకరణకే రెండు నుండి మూడు సం.లు పట్టవచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం, ప్రజలు భాగస్వామ్యం (పీపీపీ)పద్దతిలో 40:60 నిష్పత్తిలో భూసేకరణ, రాజధాని అభివృద్ధి ఆలోచన కూడా మంచిది కాదని కమిటీ స్పష్టం చేసింది. అదేవిధంగా వి.జి.టి.యం. చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను కూడా కమిటీ వ్యతిరేఖించింది. దాని వలన ఆ ప్రాంతంలో ఉన్న సారవంతమయిన పంట భూములు నాశనమయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.

 

అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన గన్నవరం విమానాశ్రయం సమీపంలో గల ప్రభుత్వ భవనాలు, భూమిలో రాష్ట్ర సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, మంగళగిరిలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల అధికార నివాసాలు ఏర్పాటుకు అనువయిన ప్రాంతాలని సూచించింది. అదేవిధంగా పులిచింతల, ముసునూరు, అమరావతి ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలు ఉన్నందున అక్కడ ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవవచ్చని సూచించింది.

 

రాజధానిలోనే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఉండాలని ఏమీ లేదని, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలో అవ్వన్నీ వేర్వేరు జిల్లాలలో ఏర్పాటు చేసిన విషయాన్ని కమిటీ ఉదాహరణగా పేర్కొంది.

 

అందువల్ల విశాఖలో హైకోర్టు మరియు ఐటీ పరిశ్రమల ప్రభుత్వ కార్యాలయాలు, రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు,  ప్రకాశం జిల్లాలో వ్యవసాయ శాఖల కార్యాలయాలు, నెల్లూరులో ఆరోగ్య మరియు నీటి పారుదల శాఖ కార్యాలయాలు, కడపలో సంక్షేమ శాఖ కార్యాలయాలు, అనంతపురంలో విద్యా శాఖల కార్యాలయాలు, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలో మౌలిక వసతుల శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా, వేగంగా అభివృద్ధి చెందుతాయని కమిటీ సూచించింది.

 

గతంలో పరిపాలన, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు అన్నీ హైదరాబాదుకే పరిమితం చేయడం వలన వచ్చిన సమస్యలను పేర్కొని, మళ్ళీ అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జిల్లాలకు సమానంగా అభివృద్ధి వ్యాపింపజేయాలని సూచించింది.

 

తీవ్ర ఆర్ధికలోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల ఆదుకోవాలని, అదేవిధంగా రాష్ట్రానికి వెంటనే ప్రత్యేకహోదా కూడా ఇవ్వాలని కమిటీ తన నివేదికలో గట్టిగా సిఫార్సు చేసింది.

 

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేటికీ విజయవాడ-గుంటూరు మధ్యనే పూర్తి హంగులతో రాజధాని నిర్మించేందుకు మొగ్గు చూపుతున్నట్లు మంత్రుల మాటలను బట్టి అర్ధమవుతోంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో భూసేకరణ కార్యక్రమం కూడా మొదలుపెట్టినట్లు తాజా సమాచారం.