సొంత పార్టీలో ‘శత్రు’వుని నియంత్రించాలి



అధికారం అనేది ఏ పార్టీకైనా ఆనందాన్ని కలిగించే విషయమే. అధికారం చాలామంది మిత్రులను అందిస్తుంది. అయితే అప్పటి వరకూ మిత్రులుగా వున్నవారిని శత్రువులుగా చేస్తుంది. మిత్రులతో సఖ్యం, శత్రువులతో వైరం అనేది మామూలే. అయితే మిత్రపక్షంలోనే వుండి శత్రువుల్లా వుండేవారితోనే చాలా ప్రమాదం. కర్ణుడి చావుకు కారణమైన అనేక అంశాల్లో తన పక్కనే వుండి విమర్శిస్తూనే వున్న శల్యుడు కూడా ఒక కారణం. ఇప్పుడు దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అలాగే వుంది. మిగతా శత్రువుల సంగతి అలా వుంచితే, పార్టీలోనే వున్న పెద్ద శత్రువు ‘శత్రు’ఘ్న సిన్హా పార్టీకి చెవిలో జోరీగలా మారి చికాకు పెడుతున్నారు. స్వపక్షంలో వున్న ఈ శత్రువు బీజేపీ అగ్ర నాయకత్వానికి కొరుకుడు పడకుండా వుంది. సినిమాల్లో విలన్ వేషాలు వేయడంలో సిద్ధహస్తుడైన శత్రుఘ్నసిన్హా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలిట విలన్‌గా మారారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి పార్టీకి ఎంతో సేవ చేసిన చరిత్ర శత్రుఘ్న సిన్హాకి వుంది. మొదట్లో బీజేపీలో చేరిన అతి కొద్ది మంది సినిమా వాళ్ళలో సిన్హా కూడా ఒకరు. బీజేపీ పుణ్యమా అని కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు కూడా నిర్వహించారు. అయితే అంతా బాగానే వుందిగానీ, ఇటీవలి కాలంలో సిన్హా పార్టీకి కొరుకుడు పడని విధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ గురించి, పార్టీ విధానాల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా వుండే క్రమశిక్షణా రాహిత్యాన్ని బీజేపీకి రుచి చూపిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు మంత్రి పదవిగానీ, మరే ప్రాధాన్యం గానీ లభించడ లేదన్న ఆవేదనే ఆయన ధోరణికి కారణం అనేది బహిరంగ రహస్యం. సిన్హాని బుజ్జగించి దారికి తెచ్చుకోవలసిన బీజేపీ నాయకత్వం పట్టించుకోనట్టు వ్యవహరించడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతోంది. ఇటీవల బీహార్ ఎన్నికల సమయంలో  బీజేపీ విజయానికి  సహకరించాల్సిన బీహారీ శత్రుఘ్న సిన్హా సహకరించలేదు సరికదా తన వ్యాఖ్యలతో పార్టీ ఓటమికి తనవంతు సహకారం అందించారు. తాజాగా రాహుల్ గాంధీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సొంత పార్టీలోనే వున్న ఈ ‘శత్రు’వును నియంత్రించకపోతే బీజేపీకి మరింత నష్టం జరగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.