జగనన్నవదిలిన బాణం గురి తప్పిందా

 

షర్మిల మరో ప్రస్థానం పాదయాత్ర నిన్నటికి 2500కి.మీ. పూర్తిచేసుకొని ఈ రోజు సాయంత్రం విశాఖ జిల్లాలో మొదలవబోతోంది. ఆమె ప్రస్థానం విశాఖ, విజయనగరం జిల్లాలు మీదుగా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు సాగుతుంది. అంటే కనీసం మరో వెయ్యి కి.మీ.ఆమె నడువనున్నారు. ఒక మహిళ తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఇంత పట్టుదలతో అన్ని వేల కి.మీ.నడవడం మామూలు విషయమేమీ కాదు.

 

కానీ ఇంత శ్రమపడుతున్న ఆమె, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రతిపక్ష నేత చంద్రబాబుని విమర్శించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ, తన శ్రమను తానే వృధా చేసుకొంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయగా మిగిలిన విలువయిన సమయాన్ని, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో స్వర్ణయుగ వర్ణనకి, దానిని తిరిగి సాధించబోయే తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవడానికే ఆమెకి సరిపోతోంది.

 

ఇంత శ్రమపడి చేస్తున్నఈ సుదీర్గ పాదయాత్రలో ఆమె ఈ వ్యర్ధ ప్రసంగాలకు సమయం వెచ్చించే బదులు, పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకొని ఉండి ఉంటే, ఆమె పాదయాత్ర ముగిసే సమయానికి రాష్ట్రమంతటా వైకాపా బలపడి ఉండేది. మళ్ళీ మళ్ళీ చేయ సాధ్యం కాని ఇటువంటి యాత్రని పూర్తిగా సద్వినియోగపరుచుకొని, ఎక్కడికక్కడ స్థానిక నేతలతో సమావేశమవుతూ పార్టీని పటిష్టపరుచుకొంటూ ముందుకు సాగి ఉండి ఉంటే దాని ఫలితం ఈ పాటికే రాష్ట్రమంతటా స్పష్టంగా కనబడేది. పైగా దానివల్ల ఆమె పార్టీలో ఒక బలమయిన ప్రత్యామ్నాయ నాయకురాలుగా ఎదిగే అవకాశం కూడా ఉండేది. కానీ, ప్రస్తుతం సాగుతున్నఆమె పాదయాత్ర తీరువల్ల ఆమెకు కానీ, పార్టీకి గానీ ఒనగూడే లాభం ఏమి లేదు.

 

అయితే, ఇందుకు ఆమెను గాక ఆమె సుదీర్గ పాదయాత్ర వల్ల పార్టీకి పూర్తి ప్రయోజనం కలిగేలా ప్రణాళిక రచించకుండా అశ్రద్ధ చూపిన పార్టీలో సీనియర్లను తప్పుపట్టాల్సి ఉంటుంది. పార్టీ అధినేతలు ముగ్గురూ-జగన్, విజయమ్మ, షర్మిల వారి వారి పరిధులలో పార్టీని బలపరిచేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం పార్టీ నిర్మాణం పట్ల ఏమాత్రం శ్రద్ద చూపకుండా, ఏసీ గదుల్లో కూర్చొని మీడియా స్టేట్మెంట్లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారు. రాజకీయ దురంధులమని భుజాలు చరుచుకొనే సదరు నేతలు, షర్మిల పాదయాత్రని పార్టీకి ఉపకరించేలా ప్రణాళికలు రచించి ఉంటే, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయినా కాకపోయినా, అది పార్టీ పటిష్టంగా ఉండేందుకు తోడ్పడేది.

 

కానీ, పార్టీ నేతలెవరికీ ఈ స్పృహ లేకపోవడం ఆ పార్టీ దురదృష్టమే. మరిటువంటి బాధ్యత లేని నేతల నందరినీ సారధిలేని రధంలోఎక్కించుకొని విజయమ్మ రానున్న ఎన్నికల కురుక్షేత్ర మహా సంగ్రామంలో ఏవిధంగా విజయం సాధించాలని భావిస్తున్నారో ఆమెకే తెలియాలి. వారి అశ్రద్ద వలన జగనన్న వదిలిన బాణం ఏ లక్ష్యం చేధించకుండానే ముందుకు దూసుకుతోంది.

 

బహుశః ఆమె పాద యాత్ర ముగిసిన తరువాత పార్టీ నిర్మాణం గురించి ఆలోచిస్తారో, లేక జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యేక మొదలుపెడతారో? ఆ పార్టీ నేతలకే తెలియాలి. అయితే అప్పటికే పుణ్యకాలం కాస్తా పూర్తయి ఎన్నికల గుమ్మంలో ఉంటాయి. అప్పుడు ఈ నేతలందరూ కాడి పక్కన పడేసి వేరే పార్టీలోకి దూకేసినా ఆశ్చర్యం లేదు.