అధికారంలో ఎప్ప‌టికీ ఉండ‌లేరు.. జ‌గ‌నన్నే ష‌ర్మిల టార్గెట్‌? ఏపీలో కొత్తపార్టీ ఖాయమా?

posted on: Jan 7, 2022 5:24PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ పెట్ట‌డంపై వైఎస్ ష‌ర్మిల ప‌దే ప‌దే ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల రాజకీయ పార్టీ ఎక్క‌డైనా పెట్టవచ్చు... పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. లేటెస్ట్‌గా మ‌రోసారి అలాంటి ప్ర‌స్తావ‌నే తీసుకొచ్చారు. "ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు.. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.. అధికారంలో ఉన్న వారు ఎప్పటికీ అధికారంలో ఉండలేరు.. పాలిటిక్స్ అంటే.. అప్స్ అండ్ డౌన్స్" అంటూ మ‌ళ్లీ క‌ల‌క‌లం రాజేశారు ష‌ర్మిల‌. ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల‌ను, జ‌గ‌న్‌ను ఉద్దేశించే అంటున్నారు. ఏపీలో అన్న‌కు పోటీగా తాను పార్టీ పెట్టే అవ‌కాశం ఉందంటూ హింట్ ఇస్తున్నారని భావిస్తున్నారు. 

ఇటీవ‌ల ఇడుపుల‌పాయ గెస్ట్‌హౌజ్‌లో అన్నాచెల్లి గొడ‌వ ప‌డ్డారు. త‌ల్లి సాక్షిగా త‌గ‌వులాడుకున్నారు. తెలంగాణ‌లో పార్టీ పెట్టి త‌న‌ను న‌వ్వుల పాలు చేస్తున్నావంటూ అన్న.. చెల్లిపై చిందులేశారు. తండ్రి ఆస్థులు త‌న‌కు స‌మానంగా పంచివ్వాల‌ని చెల్లి నిల‌దీశారు. చిల్లి గ‌వ్వ కూడా ఇచ్చేది లేదుపో.. ఏం చేసుకుంటావో చేసుకో పో.. అంటూ అన్న నిష్టూరంగా మాట్లాడారు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు.. చేసి చూపిస్తా..అంటూ చెల్లి శ‌ప‌థం చేసి.. ఇడుపుల‌పాయ నుంచి ఏడ్చుకుంటూ అర్థ‌రాత్రి ఒంట‌రిగా వ‌చ్చేశారు. క్రిస్మ‌స్ వేడుక‌ల స‌మ‌యంలో.. వైఎస్సార్ స‌మాధి సాక్షిగా.. త‌ల్లి విజ‌య‌మ్మ స‌మ‌క్షంలో.. జ‌గ‌న్‌కు, ష‌ర్మిల‌కు తీవ్రస్థాయిలో గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆ ర‌చ్చ‌.. మ‌రింత రాజుకుంద‌ని.. అన్న‌కు చెక్ పెట్టేందుకు ష‌ర్మిల వేగంగా పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు. 

రెండు విధాలుగా జ‌గ‌న్‌కు కార్న‌ర్ చేసేందుకు ష‌ర్మిల సై అంటున్నారు. బాబాయ్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో సాక్షం చెప్పేందుకు ష‌ర్మిల సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. హ‌త్య‌కు సంబంధించి అవినాష్‌రెడ్డి, జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిరెడ్డిల ద‌గ్గ‌ర త‌గు స‌మాచారం ఉంద‌ని.. ఆ వివ‌రాలు సీబీఐకి ష‌ర్మిల చెప్ప‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా వివేకా కేసు.. ష‌ర్మిల ఎంట్రీతో కీల‌క మ‌లుపు తిర‌గ‌నుంద‌ని.. ఆ మ‌లుపు జ‌గ‌న్ వైపే దారి తీస్తుంద‌ని అంటున్నారు. 

అంతేనా. ఇంకా చాలాఉంది. త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని అంత ఈజీగా వ‌దిలిపెట్టే ర‌కం కాదు ష‌ర్మిల‌. జ‌గ‌న‌న్న ఎంత మొండినే.. ష‌ర్మిల అంత‌కంటే జ‌గ‌మొండి.. అంటున్నారు. చిల్లిగ‌వ్వ ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో పో.. అంటే ఊరుకుంటుందా?  తండ్రి సంపాద‌నలో త‌న వాటా ఇవ్వ‌కుండా అంతా తానే స్వాహా చేద్దామ‌నుకుంటే చేతులు ముడుచుకు కూర్చుంటుందా? ఇప్ప‌టికే త‌న ప్ర‌త్యేక‌త‌ను, ఉనికిని బ‌లంగా చాటుకునేందుకు.. తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ స్థాపించారు ష‌ర్మిల‌. కేసీఆర్ దొర‌త‌నంపై ఒంట‌రిగా పోరాడుతున్నారు. అయితే, జ‌గ‌న్‌ది సైతం దొర‌ల పాల‌నేన‌ని.. జ‌గ‌న్ ఏలుబ‌డిలో ప్ర‌జ‌లంతా త‌న‌లానే వ‌ల‌వ‌ల ఏడుస్తున్నార‌ని గుర్తించారు ష‌ర్మిల‌. అటు, అన్న‌పై ప‌గ ఎలానూ ఉండ‌నే ఉంది. అందుకే, జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇవ్వాలంటే.. తెలంగాణ‌లో మాదిరే ఏపీలోనూ పార్టీ పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ష‌ర్మిల ఉన్న‌ట్టు తెలుస్తోంది. కొన్నిరోజులుగా ఆ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌పై ష‌ర్మిల వ‌ర్గం నుంచే లీకులు వ‌స్తున్నాయ‌ని.. ఏపీలో కొత్తపార్టీ దిశ‌గా ష‌ర్మిల స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. 

పార్టీ పెడ‌తారా.. అనే ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూర్చేలా ష‌ర్మిల ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇస్తున్నార‌నేది విశ్లేష‌కులు అంచ‌నా.  "ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు.. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.. అధికారంలో ఉన్న వారు ఎప్పటికీ అధికారంలో ఉండలేరు.. పాలిటిక్స్ అంటే.. అప్స్ అండ్ డౌన్స్" ఇవన్నీ జగన్ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలేనని భావిస్తున్నారు. ఏమో.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. అన్న‌పై కోపంతో చెల్లి.. ఏపీలో సొంత‌పార్టీ పెట్ట‌నూ వ‌చ్చు!  ఇంతకీ షర్మిల ఏపీలో పెట్టబోయే పార్టీ పేరు ఏమై ఉండొచ్చు.. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ లానే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ఏపీనా?
 

google-ad-img
    Related Sigment News
    • Loading...