బొత్స విశ్వాస ఘాతకుడు: షర్మిల

 

రాష్ట్రంలో మద్యం మాఫియా డాన్ గా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుగాంచారని, ఆయనకు పి.సి.సి. బాద్యతలు అప్పగించడం సిగ్గుచేటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల మండిపడ్డారు. ఆదివారం విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో జరిగిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడారు.

 

షర్మిల మాట్లాడుతూ... మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నా కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదు. చీపురుపల్లిలో ఉన్న వ్యాపారాలన్నీ బొత్స కుటుంబానివే. ప్రతి మద్యం దుకాణాన్ని ఒక మినీ బార్ గా మార్చే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యాన్ని పూర్తిగా నియంత్రించి కేవలం నియోజక వర్గానికి ఒక మద్యం దుకాణం మాత్రమే ఉండేలా చూస్తారని భరోసా ఇచ్చారు షర్మిల.

 

కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల కష్టం పట్టించుకోకుండా, సంక్షేమ పథకాలను వృధా చేస్తున్నారని అన్నారు. తన తండ్రి పెట్టిన రాజకీయ భిక్షను మరచిపోయి, మా కుటుంబాన్నే విమర్శించడం నైతికం కాదని, బొత్స ఒక విశ్వాస ఘాతకుడు అని షర్మిల విమర్చించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి వై.ఎస్. జగన్ ను జైల్లో పెట్టించాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధిచెప్పి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.