కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు

 

కాంగ్రెస్ నేతలు ముందు ప్రతిపక్ష నేతలపై బురద జల్లడం, ఒకవేళ దానివల్ల పార్టీ ఇరుకున పడినట్లయితే, వెంటనే ఆవిమర్శలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ మరో ఖండన చేసి చేతులు దులుపుకోవడం రివాజు. తద్వారా తమ శత్రువులపై బురద జల్లడం దిగ్విజయంగా పూర్తవుతుంది. పార్టీకి ఆ మైల అంటుకోకుండా జాగ్రత పడుతోంది.

 

ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత షకీల్ అహ్మద్ “గోద్రా సంఘటన తరువాతనే ఇండియన్ ముజాహుదీన్ ఉగ్రవాద సంస్థ పుట్టుకు వచ్చిందని” చెపుతూ అందుకు మోడీ, బీజేపీ, ఆర్.యస్.యస్. సంస్థలే కారణమన్నట్లు ఆరోపణలు చేసారు. మోడీని విమర్శించడంలో ఎప్పుడు ముందుండే దిగ్విజయ్ సింగ్ కూడా షకీల్ అహ్మద్ ను వెనకేసుకు వస్తూ ఆయన చేసిన ఆరోపణలలో అసత్యమేమి లేదని అన్నారు.

 

కానీ, ఊహించని విధంగా బీజేపీ వేరే కోణంలోంచి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసింది. “షకీల్ అహ్మద్ ఒక తీవ్రవాద సంస్థ తరపున వఖల్తా తీసుకొని మాట్లాడుతున్నట్లున్నారు,” అని తీవ్ర ప్రతివిమర్శలు చేయడంతో, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వెంటనే స్పందిస్తూ”షకీల్ అహ్మద్ చేసిన వ్యాక్యలతో పార్టీకి సంబంధం లేదు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చును,” అని ప్రకటన చేసారు. అయితే, అంత మాత్రాన్న కాంగ్రెస్ పార్టీ మోడీని అంత తేలికగా వదిలిపెట్టదని అందరికీ తెలిందే.