జయ జయంతి రోజు శశికళ సొంత పార్టీ.. తమిళ రాజకీయాల్లో కొత్త కుంపటి!
posted on: Feb 16, 2026 12:47PM
.webp)
ఇప్పుడేం చేస్తాడు మీ హీరో.. ఇది కేజీఎఫ్ లోని ఒక నేరేటివ్ డైలాగ్. ఇప్పటి వరకూ శశికళ రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నది మరెవరో కాదు ప్రధాని మోడీ. దీనంతటికీ కారణం.. ఆయన రాష్ట్రానికి సంబంధించిన కొందరు వ్యాపారవేత్తలు తమిళనాడు వచ్చినపుడు ఇక్కడ జరుగుతోన్న ఒక విషయం గమనించారు. అదేమిటంటే ఇక్కడ జయలలిత కాదు.. అంతా శశికళపెత్తనం నడుస్తోందని ఢిల్లీకి రిపోర్ట్ చేశారు. దీంతో శశికళను జయకు దూరం చేయడంలో మోడీ కీలక పాత్ర పోషించారు జయ మరణించిన వెంటనే అన్నాడీఎంకేలో నెంబర్ వన్ పొజిషన్ ఉండాల్సిన వారు శశికళ. అయితే.. ఆమె పై అప్పటి వరకూ రిజర్వులో తీర్పును వెంటనే వెలువడి ఆమె జైలుకు వెళ్లడం వెనుక ఉన్నది ఢిల్లీ పెద్దలే అంటారు పరిశీలకులు. అంతే కాదు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ కూడా ఆయ్యారు. ఇప్పుడు చూస్తే శశికళ జైలు నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకుంటున్నారు.
శశికళ ఏ సామాజిక వర్గానికి చెందిన వారు? ఆమెకు పార్టీ పెట్టేంత ఆర్ధిక స్తోమత ఉందా? ఒక వేళ ఉంటే ఆమె తమిళనాడు రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపగలరు? అంటే.. శశికళ తమిళనాడులోని అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించే తేవర్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ వర్గం వారు దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్నారు.
శశికళ జయలలితతో సావాసం కారణంగా ఆమె, ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆర్థికంగా బాగా బలపడ్డారని చెబుతారు ఐటీ, ఈడీ నివేదికల ప్రకారం.. ఆమెకూ ఆమె బంధువులకు కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తిపాస్తులున్నాయి. 2019-20లో.. ఆదాయ పన్ను శాఖ ఆమె, ఆమె బినామీలకు సంబంధించిన రూ. 1600 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించడం ఎంత మాత్రం అప్రస్తుతం అవ్వదు. ఆమె కుటుంబ సభ్యులకు మిడాస్ డిస్టిలరీస్, జాజ్ సినిమాస్ వంటి పెద్ద వ్యాపార సంస్థల్లో వాటాలున్నాయి.
ఇక శశికళ తమిళనాడు రాజకీయాల్లో తన ఉనికి చాటు కోడానికి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో యత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2024 జూన్ లోనే ఆమె రాజకీయాల్లో తిరిగి వస్తున్నట్టు ప్రకటించారు. ఇక 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా.. పార్టీ ప్రకటించారు. ఏఐడీఎంకేని తిరిగి ఏకం చేసి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యం అంటూనే ఆమె తాజాగా రాజకీయ పార్టీ ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయవర్గాలు అంటున్నాయి.
జయ జన్మదిం అయిన ఫిబ్రవరి 24న పార్టీ, గుర్తు, విధి విధానాల ప్రకటన చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ లెక్కన శశి పెట్టే పార్టీ పేరు ఏమై ఉంటుందని ఆరా తీస్తే.. ఆమె సోదరుడు వీకే దివాకరన్ ఇప్పటికే అన్నా ద్రావిడ కగజం అనే పార్టీ పేరు రిజిస్టర్ చేశారు. దీన్ని తిరిగి తెరపైకి తెచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాత జయ పేరు అమ్మా అని ఎక్కువగా ఈ ప్రాంతంలో పిలుస్తుంటారు. అలా అన్నా బదులు అమ్మ ద్రవిడ కగజం అనే పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది.
అయితే చట్టపరమైన అడ్డంకుల దృష్ట్యా శశికళ 2027 వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. కానీ 2026లోనే ఎన్నికలు వస్తుండటంతో ఆమె పార్టీని వెనకుండి నడపడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. తమ సామాజిక వర్గం బలంగా ఉండే మొత్తం 40 స్థానాల్లో ఆమె పార్టీ పోటీ చేసేలా కనిపిస్తోంది.
అయితే ఏఐడీఎంకేకి శశి ద్వారా ఓట్ల చీలిక జరిగి.. తిరిగి డీఎంకేకి లబ్ధి జరిగే అవకాశమున్నట్టు అంచనా. శశితో పాటు విజయ్ టీవీకే పార్టీ సైతం ఓట్ల చీలికలో ప్రభావం చూపనుంది. ఇటు శశి ద్వారా అన్నాడీఎంకే ఓట్లు చీలితే.. అటు విజయ్ ద్వారా డీఎంకే ఓట్లు చీలేలా ప్రస్తుత తమిళనాడు పరిస్థితి కనిపిస్తోంది.. మరి చూడాలి.. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాయో తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే అన్ని అడ్డంకులను దాటుకుని శశి తిరిగి తన నెచ్చెలి జయను గుర్తుకు తెచ్చే విధంగా ఎలాంటి పార్టీ ప్రకటన చేయబోతారో అన్న ఉత్కంఠ అయితే తమిళరాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది.


.webp)



