కార్డు చెల్లింపులు ఇప్పుడు కారుచౌక
posted on Feb 25, 2016 4:11PM
.jpg)
ఇప్పటివరకూ డెబిట్/క్రెడిట్/ఆన్‌లైన్/మొబైల్‌ల ద్వారా చెల్లింపులు జరిపితే సర్‌ఛార్జీ, సర్వీస్ ఛార్జీ అంటూ జేబులకి చిల్లుపడిపోయేది. అందుకే ప్రజలు ఎక్కువగా నగదు ద్వారానే చెల్లింపులు జరపడానికి మొగ్గు చూపుతున్నారు. నగదులో చెల్లింపులు చేయడం కష్టమే కాదు భద్రత కూడా తక్కువే. పైగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి రావు. అందుకే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇకపై వాటి మీద సర్‌ఛార్జీ, సేవారుసుమూ రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా లావాదేవీలు సులువుగా మారడమే కాకుండా, పన్నుఎగవేతలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.
అంతేకాదు! మున్ముందు ఒక స్థాయిని మించిన చెల్లింపులని కేవలం డిజిటల్ ద్వారానే అనుమతించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆన్‌లైన్లలో చెల్లింపులు జరిపేవారికి అందులో మోసం జరుగుతుందేమో లేకపోతే డబ్బు ఎక్కడన్నా ఇరుక్కుపోతుందేమో అన్న భయాలు ఉండేవి. చాలామంది ఖాతాదారులు ఈ భయంతోనే ఆన్‌లైన్ చెల్లింపులకు వెనుకాడుతూ ఉంటారు. ఇకపై అలాంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం తగిన వ్యవస్థకు రూపకల్పన చేయనున్నట్ల సమాచారం.