అవిశ్వాసం అందుకు కాదట!

 

స్వయంగా కాంగ్రెస్ యంపీలే తమ యుపీయే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నారు గనుక, ఇంకా ఘోర పరాభవం మూట కట్టుకోక ముందే కాంగ్రెస్ పార్టీ గద్దె దిగడం మంచిదని ఒక బీజేపీ నేత అభిప్రాయం వ్యక్తం చేసారు. తమ పార్టీ ఒక్క తెలంగాణా అంశంపై తప్ప ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఏ పార్టీ ప్రతిపాదించే ఏ (అవిశ్వాస) తీర్మానానికయినా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. అదేవిధంగా త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరియు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతుందని ప్రకటించారు. అంటే ఒకవేళ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీకి గండం తప్పదని స్పష్టం అవుతోంది.

 

అయితే ఇటువంటి సమయంలో కాంగ్రెస్ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వాన్నిపడగొట్టాలనే ఉద్దేశ్యంతో తాము అవిశ్వాస తీర్మానం పెట్టదంలేదని, కేవలం తెలంగాణా బిల్లుకి బ్రేకులు వేయడానికేనని ప్రకటించడంతో సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు మళ్ళీ మరో కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన ప్రకటించినట్లయింది. రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నపటికీ, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఇటువంటి సమస్యలు తప్పవని ఆయన అన్నారు.