ఆంధ్ర, తెలంగాణాలలో మారిన రాజకీయ బలాబలాలు

 

మూడేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రకటన చేయగానే సీమాంధ్ర నేతలందరూ పార్టీలకతీతంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గక తప్పలేదు. సీమాంధ్ర నేతలు కేంద్ర నిర్ణయాన్ని సైతం మార్చగలగడంతో వారి శక్తిపై సీమాంధ్ర ప్రజలకు అపారమయిన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయి. ఆ తరువాత తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్నతరుణంలో టీ-కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీలు, జేయేసీలు కలిసి పనిచేస్తూనే ఒకరితో మరొకరు కీచులాడుకొంటుంటే, ఇంత అనైక్యంగా ఉన్నవీరు తెలంగాణా సాధించేనా? అని అందరూ పెదవి విరిచారు. సీమాంధ్ర నేతల శక్తి యుక్తులపై ప్రజలకున్నఅపార నమ్మకం వల్ల, తెలంగాణా ప్రజలు, పార్టీలు ఎంతగా పోరాడినా తెలంగాణా ఏర్పడే అవకాశం లేదనే ధీమా కూడా ఉండేది. బహుశః ఆ ధీమాతోనే అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి.

 

అయితే తెలంగాణా ప్రజల అలుపెరగని పోరాటాల వల్లనయితేనేమి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే సోనియా గాంధీ దృడసంకల్పం వల్లనయితేనేమి, రాష్ట్రంలో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బతీయాలనే కాంగ్రెస్ దురాలోచన వల్లనయితేనేమి, సీమాంధ్ర మంత్రుల, యంపీల సహకారం వల్లనయితేనేమి మొత్తం మీద హటాత్తుగా రాష్ట్ర విభజనకి, తద్వారా తెలంగాణా ఏర్పాటుకి రంగం సిద్దమయిపోయింది.

 

అయితే మరి సర్వశక్తివంతులనుకొన్న సీమాంధ్ర నేతలందరూ ఈసారి ఎందుకు విఫలమయ్యారు? అనే ప్రశ్నకు జవాబు అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరుగుతోందని చాలా ముందే కాంగ్రెస్ నేతలందరికీ తెలిసినప్పటికీ, వారిలో కొంతమంది మంత్రి పదవులకు, మరికొందరు పార్టీ టికెట్లకు, కాంట్రాక్టులకు అమ్ముడుపోయారనేది బహిరంగ రహస్యం. అంటే తెలంగాణా సాధనకు తెలంగాణా ప్రజల కృషి పట్టుదల ఎంత ఉందో, అందుకు సరిసమానంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు, నేతల సహకారం కూడా ఉందని అంగీకరించక తప్పదు. మళ్ళీ వారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమను అన్యాయం చేసిందని వాపోతూ అద్భుతంగా నటిస్తున్నారు.

 

ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలో రాజకీయపార్టీల పరిస్థితి పూర్తిగా తారుమరయ్యింది. ఒకప్పుడు ఐకమత్యంగా ఉన్న సీమాంధ్ర నేతలు, పార్టీలు ఇప్పుడు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా విడిపోవడమే కాకుండా, సీమాంధ్రపై పట్టుకోసం ఎంతకయినా దిగజారేందుకు వెనకాడటం లేదు. వచ్చేఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ల కోసం, పార్టీలను, సిద్ధాంతాలను అన్నిటినీ పక్కనబెట్టి అటూఇటూ పరుగులు తీస్తున్నారు.

 

ఇక తెలంగాణాలో పార్టీల నేతలందరూ ఇంతవరకు వచ్చిన తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోనీయకూడదనే గట్టి పట్టుదలతో తమ విభేదాలను, పార్టీ జెండాలను కూడా పక్కనబెట్టి సమైక్యంగా ముందుకు కదులుతున్నారు. వారు ఇప్పుడు సీమాంధ్ర నేతలను ఎదుర్కోవడం తమకు పెద్ద సమస్య కాదనే పూర్తి నమ్మకంతో ఉన్నారు. సీమాంధ్ర నేతలలో చిత్తశుద్ధి కొరవడిందనే సంగతి గ్రహించడమే అందుకు కారణం.

 

తెలంగాణా బిల్లుని శాసనసభలో ఓడిస్తామని, లేకుంటే పార్లమెంటులో ఓడిస్తామని, ఇంకా కుదరకుంటే రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించి ఆయన మనసు మార్చేస్తామని, లేకుంటే సుప్రీం కోర్టులో కేసులు వేసి ఆపేస్తామని ఇలా ఏవేవో కట్టు కధలు, పిట్ట కధలు సీమాంధ్ర నేతలు చెపుతూనే ఉన్నారు. అయితే వారి అసలయిన లక్ష్యం రాష్ట్ర విభజనను ఆపడం కాదు. ఆపడానికి తాము మాత్రమే చాలా గట్టిగా కృషి చేసామని చెప్పుకొంటూ వచ్చే ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడమే. మొన్న శాసనసభ సమావేశాలప్పుడు వారందరూ ప్రవర్తించిన తీరు అనుసరించి వ్యూహాలే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. 

 

ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సాగుతున్నఈ వికృత రాజకీయ క్రీడని బహుశః రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా ఎన్నికలు పూర్తయ్యేవరకు వారు ఆడుతూనే ఉంటారు. అందుకు ప్రజలు తగిన ప్రతీకారం తీర్చుకోదలిస్తే తమను ఇంతగా మోసం చేసినవారు ఏ పార్టీలో చేరినా వారిని నిర్దాక్షిణ్యంగా ఓడించడమోకటే మార్గం.