రాజుకుంటున్న వర్గీక‘రణం’

దళితుల కోసం కేటాయించిన రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాలంటూ గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. తెలంగాణ ఉద్యమకాలంలో కాస్త నిద్రాణంగా ఉన్న ఈ ఆకాంక్ష ఇప్పుడు మళ్లీ వినిపించడం మొదలైంది. వర్గీకరణ జరగాలన్న నినాదంతో మంద కృష్ణమాదిగ దిల్లీలో మరోసారి ధర్నా చేపట్టడంతో దేశమంతా అటువైపుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.


బీసీలలో వివిధ కులాల వెనుకబాటుతనాన్నీ, జనాభా నిష్ఫత్తినీ దృష్టిలో ఉంచుకుని వారికి లభించే రిజర్వేషన్లను వేర్వేరుగా విభజించారు. దాని వల్ల ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కిందన్న తృప్తి ఉంది. కానీ ఇదే తరహా వర్గీకరణను దళితులలో ఎందుకు చేపట్టకూడదన్నదే మాదిగల ప్రశ్న. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు దశాబ్దాల క్రితమే రామచంద్రరాజు కమిషన్‌ను నియమించారు. కమిషన్‌ నివేదిక వర్గీకరణకు అనుకూలంగా రావడంతో కొన్నాళ్లపాటు దాని అమలు కూడా జరిగింది. అయితే చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఈ వర్గీకరణ ఉందంటూ సుప్రీంకోర్టు ఆక్షేపించడంతో వర్గీకరణ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.


మందకృష్ణ మాదిగ నేతృత్వం వహిస్తున్న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (యం.ఆర్‌.పి.ఎస్‌) ఈ వర్గీకరణ కోసం గట్టిగా పట్టుబడుతోంది. మరోవైపు ఆర్‌.కృష్ణయ్య వంటి నేతల నేతృత్వంలో ఉన్న మాల సంఘాలు వర్గీకరణకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని విప్పుతున్నాయి. కృష్ణయ్య ఏకంగా మరో అడుగు ముందుకు వేసి, తన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు రాజకీయ నేతలతో సైతం జట్టు కట్టారు. ఇరు వర్గాలూ తమకు అనుకూలమైన వాదనలకే కట్టుబడి ఉండటంతో సమస్య జటిలమైపోయింది. పరస్పర అంగీకారంతోనూ, చర్చలతోనూ ముందుకు సాగాల్సిన పరిష్కారం కాస్తా పీటముడిగా మారిపోయింది.


ఈ సమయంలో పార్లమెంటులో వర్గీకరణకు అనుకూలంగా చట్టాన్ని చేసే ధైర్యం ఎవరు చేస్తారన్నది సందేహమే! అలాంటి ధైర్యంతో ముందుకు సాగితే కనుక, తెలుగు రాష్ట్రాలలోని దళితులలో అధికశాతం ఉన్న మాలల ఆగ్రహానికి సదరు పార్టీలు గురి కావలసి ఉంటుంది. మరోవైపు మాలల జనాభా అధికం అన్న కారణంతోనే వర్గీకరణ జరగాలంటూ మాదిగలు పట్టుబడుతున్నారు. బి.సిలలో ఇలాంటి వర్గీకరణ జరిగినప్పుడు ఎలాంటి అశాంతీ తలెత్తలేదని గుర్తు చేస్తోంది యం.ఆర్‌.పిఎస్! వర్గీకరణే కనుక లేకపోతే దళితులలో మరింత దయనీయమైన స్థితిలో ఉన్న పాకి వంటి ఉపకులాలవారు ఎప్పటికీ రిజర్వేషన్ల ఫలాలను అందుకోలేరని హెచ్చరిస్తోంది.


ఏది ఏమైనా మరోసారి ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ సమస్య వార్తల్లోకి వచ్చింది. దిల్లీలో మంద కృష్ణ మాదిగ సాగించిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న యెండ్లూరి సుధాకర్‌ వంటి మేధావులు మాలల అభ్యంతరాల మీద విరుచుకుపడ్డారు. మరోవైపు మాలలు మాత్రం వర్గీకరణ పేరుతో దళితులలో చీలిక తీసుకు రావడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జనాభా సమీకరణలు, నాయకత్వాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ ఉద్యమం అంత బలంగా లేదనీ, ఇటు తెలంగాణలో మాదిగల సంఖ్యే ఎక్కువగా ఉందనీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చే వాదనలలో మళ్లీ మార్పు తప్పదు. దాంతో ఈ సమస్య అసలు పరిష్కారం అవుతుందా అని ఎదురుచూడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఏది ఏమైనా ఒకటిగా ఉండాల్సిన మాలమాదిగలు ఇలా వర్గీకరణ పేరుతో కత్తులు దూసుకోవడం మాత్రం బాధాకరం!