వరకట్నానికి వ్యతిరేకంగా... ఓ తల్లి పోరాటం!

1979- శశిబాల ఒక అందమైన 20 ఏళ్ల యువతి. దిల్లీలోని ప్రఖ్యత లక్ష్మీబాయ్‌ కాలేజి నుంచి డిగ్రీని కూడా సాధించింది. శశిబాలకు పది నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు తను ఆర్నెళ్ల గర్భవతి కూడా! బయట నుంచి చూసేవారికి ఇదంతా ఓ అందమైన జీవితం తాలూకు వర్ణనగా తోచవచ్చు. కానీ శశిబాల వ్యక్తిగత జీవితం ఆ చిత్రానికి తలకిందులుగా కనిపిస్తుంది. పెళ్లయిన దగ్గర్నుంచి శశిబాల అత్తమామలు కట్నం కింద ఏదోఒక వస్తువుని తీసుకురమ్మంటూ గొడవచేస్తూనే ఉన్నారు. శశిబాల తన తల్లి సత్యరాణి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ, తల్లీకూతుళ్లు వారి కోరికను ఎలా తీర్చాలా అని మదన పడుతూనే ఉన్నారు. సత్యరాణి వితంతువు, పైగా శశిబాలతో పాటు ఆమె మీద మరికొందరి బిడ్డల భారం కూడా ఉంది.
ఇలాంటి సమయంలో ఓ రోజు సత్యరాణికి, శశిబాల అత్తగారింటి నుంచి వెంటనే రమ్మంటూ కబురు వచ్చింది.

 

 

పరుగుపరుగున వెళ్లిన ఆమెకు తన బంగారు కూతురు నల్లటి ముద్దగా ఓ మూల కనిపించింది. ‘నీ కూతురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ చెత్తని ఇక్కడి నుంచి పట్టుకుపో!’ అన్నారు శశిబాల అత్తగారు. కూతురి శవాన్ని కప్పేందుకు వాళ్లు ఒక దుప్పటిని అందించేందుకు కూడా సిద్ధపడలేదు. 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలానే వినిపించేవి. కిరసనాయిలు పోసుకునో, చీరకు నిప్పంటుకునో నిస్సహాయంగా ఎందరో ఆడవాళ్లు చనిపోయేవారు. అవన్నీ ప్రమాదాలో ఆత్మహత్యలో కాదనీ, వరకట్నపు హత్యలనీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. కానీ సత్యరాణి అలా నిశ్శబ్దంగా ఊరుకోదల్చుకోలేదు.

 

స్కూటరు కొనిపెట్టలేదన్న కారణంగా తన అల్లుడు ఆమెను చంపేశాడంటూ కేసుని నమోదు చేసింది. అయితే అప్పట్లో చట్టాలు ఇంత కఠినంగా ఉండేవి కాదు. పెళ్లి సమయంలో అందుకున్నవే కట్నకానుకల కిందకి వస్తాయన్న నిర్వచనం ఉండేది. పైగా చావుకి సంబంధించిన ఆరోపణలను నిరూపించే బాధ్యత మృతుల తరఫు న్యాయవాదులకే ఉండేది. సత్యరాణి ఒక పక్క తన కూతురి చావుకి సంబంధించిన కేసులను పోరాడుతూనే, మరో పక్క వరకట్నపు చావులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యుల కోసం గొంతు విప్పడం మొదలుపెట్టింది. తమ కూతురు వరకట్నం కారణంగా చావుని ఎదుర్కొందిని భావించిన ప్రతి ఒక్కరి పోరాటానికీ ఆసరాగా నిలిచేది.

 

 

 

సత్యరాణి తనలాంటి దుస్థితిలో ఉన్న మరికొందరితో కలిసి శక్తిశాలిని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేవారికి ఈ సంస్థ నిలువనీడను కల్పించేది. సత్యరాణికి చదువు లేదు. వయసు పైబడుతోంది. పైగా చెట్టంత కూతురిని పోగొట్టుకుంది. అయినా వరకట్నానికి వ్యతిరేకంగా తన పోరులో రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. రానురానూ సత్యరాణి ఉద్యమం ఫలితాలనివ్వసాగింది. వరకట్న వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మరింత పెట్టాల్సి వచ్చింది. వరకట్నం అంటే కేవలం డబ్బే కాదు, వస్తువుని కోరడం కూడా వరకట్న పరిధిలోనే వస్తాయంటూ చట్టాన్ని మార్చింది కేంద్రం. పెళ్లైన ఏడేళ్ల లోపు స్త్రీ ఆత్మహత్య చేసుకున్నా కూడా, అందుకు కారణం అత్తవారింటి ఆరళ్లు కూడా కావచ్చునంటూ మరో సవరణ కూడా చేసింది.

 

ఒక పక్క సమాజంలో మార్పు రావడం, మరో పక్క చట్టాలకు పదునెక్కించడంతో... వరకట్న హత్యలు కొంతమేరకన్నా తగ్గాయి. ముఖ్యంగా ‘వంటగదిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు’ చాలామేరకు తగ్గాయి. నేరాల తగ్గుదలను చాలామంది గమనించారు కానీ, అందుకు కారణమైన సత్యరాణి వంటి తల్లుల పోరాటాన్ని పెద్దగా గమనించింది లేదు. వరకట్న చావులను తగ్గించడంలోనే సత్యరాణి విజయం సాధించడమే కాదు, మారిన చట్టాలకు అనుగుణంగా తన అల్లుడికి శిక్షపడేలా కూడా విజయం సాధించింది. 2014లో సత్యరాణి తన 85వ ఏట ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ ఆమె జీవితం ఏనాడూ వృధాగా పోలేదు. ఒక తల్లిగా తాను పొందిన గర్భశోకాం, మరో తల్లికి కలుగకుండా ఉండేందుకే అనుక్షణం పోరాడింది. ఎందరో కూతుళ్లకి న్యాయాన్ని సాధించింది. మరెందరో వధువులు వరకట్నపు కోరల్లో చిక్కుకోకుండా తన జీవితాన్ని అడ్డు వేసింది.

 

- నిర్జర.