పిల్లలకు పాఠంగా సత్య నాదెళ్ల జీవితం!
posted on Feb 23, 2016 3:34PM

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గురించి మన పిల్లలు ఇక పాఠాలు చదువుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో ‘స్ఫూర్తి ప్రదాతలు’ పేరిట సత్యనాదెళ్ల, పర్వతారోహకుడు మస్తాన్‌బాబు, చిత్రకారుడు సంజీవ్‌దేవ్‌ల జీవిత చరిత్రలను పొందుపరచనున్నారు. ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన సిలబస్ ప్రకారం ఇలాంటి మార్పులు ఎన్నో చోటు చేసుకోనున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా అలనాటి నుంచి ఈనాటి దాకా ఉన్న తెలుగు ప్రముఖులకు తగినన్ని పుటలను కల్పించాలనుకుందట. ఒకప్పటి యుద్ధవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నేటి కేన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు... వంటి తెలుగు ప్రముఖులందరి గురించీ ఈ సందర్భంగా పిల్లలు తమ పుస్తకాలలో చదువుకోనున్నారు. అంతేకాదు! మన పండుగల గురించీ, జానపద కళల గురించీ కూడా వీలైనంత సమాచారాన్ని పిల్లలకు అందచేసే ప్రయత్నంలో ఉందంట ప్రభుత్వం.