అమ్మా సానియా.. ఏడ్వాల్సింది నువ్వు కాదమ్మా!

 

టెన్నిస్ స్టార్‌గా వెలిగిన సానియా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. జీవితంలో ఇంతకాలం ఎదుర్కోనన్ని విమర్శలు వారం రోజుల్లోనే ఎదుర్కొనేసరికి పాపం సానియాకి ఏడుపు వచ్చేసింది. తుది శ్వాస విడిచేవరకూ భారతీయురాలినే అనే భారీ స్టేట్‌మెంట్ ఇచ్చేసి, తమ ఫ్యామిలీ హిస్టరీ పాఠాలు జనానికి చెప్పేసి, ఆ తర్వాత ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేసింది. సానియా ఏడుపు సీన్ చూసి కొంతమందికి బాధ కలిగి వుండొచ్చేమోగానీ, చాలామందికి సానియా ఏడుపు చూస్తే చిరాకేసింది.

 

ఏవమ్మా సానియా.. నాలుగైదు విమర్శలకే భోరున ఏడ్చేస్తున్నావ్.. నువ్వు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌వా? తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన మహిళ ఎలా వుండాలి? ఎలాంటి సమస్య ఎదురైనా కొంగు నడుముకు కట్టి కదన రంగంలోకి దూకే తెలంగాణ మహిళలా వుండాలి. మరి నువ్వేమో చిన్న వివాదానికే బేర్‌మని ఏడ్చేశావు. బుర్రుమని ముక్కు చీదేశావు! నువ్వు ఏడ్చేశావు కదా అని సెంటిమెంట్ ఫీలైపోయి ఇక నిన్ను ఎవరూ విమర్శించర్లే అని నువ్వు అనుకుంటూ వుంటే నీ అంత అమాయకురాలు మరెవరూ వుండరు. ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్’ అనే హోదా  పొందినందుకు, కోటి రూపాయలు అప్పనంగా అందుకున్నందుకు నువ్వు ఎన్ని విమర్శలైనా భరించాల్సిందే. అయినా తెలంగాణ మహిళల నుంచి స్పూర్తిని తీసుకోవాల్సిన స్థితిలో వున్న నువ్వు తెలంగాణ మహిళలకి ఎలా స్ఫూర్తిగా నిలుస్తావు?



అయినా నిన్ను విమర్శిస్తున్న వాళ్ళు ఏమన్నా తప్పు మాట్లాడారా? నువ్వు పుట్టిన ఊరు గురించి, మెట్టిన దేశం గురించి, 1956 నిబంధన గురించీ అన్నీ నిజాలే మాట్లాడారు. ఉన్నమాట అంటే నీకు ఉలుకెందుకో అర్థంకావట్లేదు. అదిసరే, నువ్వు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యావు కదా.. అసలు నీకు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నువ్వు కనీసం ‘జై తెలంగాణ’ అన్న దాఖలాలు ఏవైనా వున్నాయా? ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ట్రైచెయ్! ఏరకంగా నువ్వు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌వి అవుతావు? తెలంగాణ ఉద్యమ సమయంలో నిరసనలు, ప్రదర్శనలు చేసి పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిన్న మా తెలంగాణ ఆడపడుచులకు మించిన అర్హతలు తెలంగాణ అంబాసిడర్‌ కావడానికి నీకు ఏమి వున్నాయి?



ఎవరో ఏదో పొలిటికల్ గేమ్‌ కోసం, ఓట్ల రాజకీయాల కోసం నీకు పదవి ఇస్తానని అంటే, నీకున్న అర్హతలేంటని వెనకాముందూ ఆలోచించకుండా వెళ్ళి కమిట్ అయిపోయావు. కోటి రూపాయల చెక్ ఇస్తే మొహమాటానికి కూడా వద్దనకుండా ఎగిరి గంతేసి తెచ్చుకున్నావు. నేను తెలంగాణ అమ్మాయినే అని టీవీ ఛానల్లో భోరున ఏడ్చేశావే...  మరి అలాంటప్పుడు నీ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయడానికి నీకు కోటి రూపాయలు ఎందుకు తీసుకున్నావ్? ఇప్పటి వరకు టెన్నిస్ ద్వారా, ప్రకటనల్లో నటించడం ద్వారా కోట్లానుకోట్లు సంపాదించేశావు కదా.. అలాంటప్పుడు ఈ కోటి నాకు వద్దు నా తెలంగాణ కోసం ఫ్రీగా బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటానని ఒక్క మాట అనలేకపోయావా?!



నువ్వు బ్యాంక్‌లో వేసి క్యాష్ చేసేసుకున్న చెక్ తాలూకు కోటి రూపాయలు ఎవరివో తెలుసా? తెలంగాణ ప్రజల కష్టార్జితమది.. తెలంగాణ ప్రజల చెమట బిందువులవి.. తమ చెమటబిందువులు మరొకరికి అత్తరులా మారిపోతే ఎవరికైనా కడుపు కాలుతుంది. ఆ కడుపు మంటని అర్థం చేసుకుని నువ్వే ఆ కోటి హుందాగా తిరిగి ఇచ్చేసి వుంటే తెలంగాణ ప్రజల్లో నీమీద గౌరవం పెరిగి వుండేది... తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సరైన వ్యక్తిని ఎంపిక చేశారన్న అభిప్రాయం కలిగి వుండేది. తద్వారా నువ్వు టీవీ ప్రోగ్రామ్‌లో భోరున ఏడ్చేయాల్సిన అవసరమూ వుండేది కాదు.. అందుకే.. అమ్మా సానియా.. ఇప్పుడు ఏడవాల్సింది నువ్వు కాదమ్మా... నిన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా భరించాల్సిన నా తెలంగాణ!

 

అవునుగానీ, నువ్వు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌వి కదా.. నిన్నగాక మొన్న మన తెలంగాణలోని మెదక్ జిల్లాలో స్కూలు బస్సుని రైలు ఢీకొని 16 మంది చిన్నారులు చనిపోయారు. ఇంకా 20 మంది చిన్నారులు చావుబతుకుల్లో వున్నారు. చాలా గొప్ప పదవిలో వున్న నువ్వు ఈ సంఘటన మీద నీ సంతాపంగానీ, సానుభూతిగానీ, వ్యక్తం చేశావా? పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులను గానీ, గాయపడిన పిల్లలను గానీ పరామర్శించావా? కనీసం ఒక్క కన్నీటి చుక్కైనా కార్చావా? ఇవేవీ చేయని నీకు ఆ పదవి ఎందుకు దండగ? పదవి అంటే డబ్బులు తీసుకోవడం కాదు.. బాధలు, బాధ్యతలు పంచుకోవడం!