సానియా మీర్జా-తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్!!!

 

 

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఊహించిన దానికంటే ఎక్కువే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణా కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలు ఏనాడు తెలంగాణా ఊసెత్తని ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడాన్ని తప్పుపడుతున్నారు. కానీ సానియా మీర్జా మాత్రం తను పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకొన్నప్పటికీ, చివరి శ్వాసవరకు భారతీయురాలిగానే ఉంటానని, తన తండ్రి తాత ముత్తాతలు అందరూ హైదరబాదులో స్థిరపడి నిజాం కాలం నుండి అక్కడే పనిచేస్తున్నారని ఆమె తన భారతీయత, స్థానికతపై వివరణ ఇచ్చుకొన్నారు. అందువల్ల తనను విమర్శిస్తున్న రాజకీయ నేతలు ఇటువంటి వివాదాలపై గాక దేశానికి పనికివచ్చే పనిమీద దృష్టిపెడితే బాగుంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు.

 

నిజమే! సానియా భారతీయత, స్థానికతపై వివాదం అనవసరం. ఆమె దేశం గర్వించదగ్గ అత్యత్తమ టెన్నిస్ క్రీడాకారిణి అనడంలో కూడా ఎటువంటి సందేహమూ లేదు. దీనిపై మత రాజకీయాలు చేయడం కూడా చాలా తప్పు. అందువల్ల ఆమె తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియుక్తులవడానికి అర్హురాలేనా కాదా అనే అంశంపై మాత్రమే చర్చిస్తే బాగుంటుంది.

 

ఆమె హైదరాబాదులో పెరిగి అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగినప్పటికీ ఏనాడు కూడా తెలంగాణతో మమేకం అయిన సందర్భం లేదు. ఆమెను ఎప్పుడూ ప్రజలు, ప్రభుత్వాలు గౌరవించడమే తప్ప ఆమె ప్రజలకు, దేశానికి చేసింది ఏమీ లేదు. ఆమె 2003లో హైదరాబాదులో సానియామీర్జా టెన్నిస్ అకాడమీ స్థాపించారు. గ్రామాలలో, పట్టణాలలో ఉన్న బాలలకు, యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణా సౌకర్యాలను కల్పించి వారిని అత్యుతమ క్రీడాకారులుగా తీర్చిదిద్డుతూ దేశానికి ఎనలేని సేవ చేస్తున్నానని చెప్పుకొంటున్న సానియా మీర్జా ఆ అకాడమీ ద్వారా కూడా బాగానే సంపాదించుకొన్నారు. ఎందుకంటే టెన్నిస్ అనేది నిరుపేదలు, సామాన్య మధ్యతరగతి ఆడగలిగే ఆట కాదు. ఆ ఆటలో శిక్షణ పొందాలంటే ఆర్ధిక స్తోమతు ఉన్నవారు లేదా ఏదయినా వ్యాపార సంస్థ స్పాన్సర్ చేస్తున్న వారికి మాత్రమే టెన్నిస్ రాకెట్ పట్టుకొనే భాగ్యం కలుగుతుంది. అందువల్ల సానియా మీర్జా స్థాపించిన టెన్నిస్ అకాడమీ ద్వారా ఆమె వ్యాపారమే చేస్తున్నారో లేక దేశసేవే చేస్తున్నారో సులభంగా అర్ధం అవుతుంది. దానిని ఆమె దేశసేవగా భావిస్తే భావించుకోవచ్చును. అదే దేశసేవ అయితే ఆవిధంగా రాష్ట్రంలో, దేశంలో చాలా మందే దేశసేవ చేస్తున్నారు.

 

ఇక దేశం తరపున ఆడటం ఎవరికయినా గర్వ కారణమే! కానీ ఆ అవకాశం ఆమె వంటి ఏ కొద్ది మందికో దక్కుతుంది. కారణం క్రీడల్లో రాణించేందుకు నేడు కేవలం నైపుణ్యం ఒక్కటే ఉంటే సరిపోదు. ఆర్ధిక స్తోమత లేదా స్పాన్సర్లు, రాజకీయ పలుకుబడి వంటివనేకం ఉండాలి. అవ్వన్నీ ఉన్నవారే క్రీడల్లో పైకి ఎదగగలుగుతారు. మిగిలిన వారు సినిమాలాలో హీరో, హీరోయిన్ల వెనుక నర్తించే జూనియర్ ఆర్టిస్టుల్లాగే అనామకులుగా మిగిలిపోతారు. కానీ దానర్ధం వారందరికీ దేశభక్తి లేదనీ కాదు. దేశం తరపున ఆడాలనే కోరిక లేదని కాదు. అందువల్ల దేశం తరపున అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నవారే దేశభక్తులు, గొప్ప క్రీడాకారులు, కేవలం వారివల్లనే దేశానికి ఎక్కువ మేలు జరుగుతుందనే దురాభిప్రాయం తొలగించుకొని చూసినట్లయితే, ఆమె కంటే ఎక్కువగా దేశానికి, తెలంగాణా రాష్ట్రానికి సేవలు అందిస్తున్న వారు చాలా మందే కళ్ళకు కనబడతారు. మరుగునపడి ఉన్న అటువంటి మాణిక్యాలను గుర్తించి వారికి ఇటువంటి ప్రోత్సాహకాలు అందిస్తే అందరూ హర్షిస్తారు. కానీ సానియా మీర్జా అంతర్జాతీయ క్రీడాకారిణి గనుక, ఆమెకు కోటి రూపాయలు బహుమానంగా ఇస్తే ఆమె ఇంతకాలం చేయనిది ఇప్పుడు కొత్తగా ఏదో మేలు చేస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. ఏమయినప్పటికీ అడగకుండా కోటి రూపాయలు బహుమానంగా ఇస్తుంటే ఎవరయినా ఆమెలాగే మాట్లాడుతారు. అందువల్ల ఆమెను తప్పుపట్టడం కూడా అనవసరం.