TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్రతిహాతంగా ఇనుప ఖనిజం దోపిడీ

Published on: Tue Apr 3, 2012 9:20AM

రాష్ట్రంలో పలు రకాల దోపిడీదారులు స్వైరవిహారం చేస్తున్నారు. మద్యం రూపంలో కొంతమంది, ఇసుక రూపంలో కొంతమంది, ఎర్రమట్టి రూపంలో మరికొంతమంది ఇలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కొంతమంది దోపిడీదారులు రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల సహాయ సహకారాలతో ఇనుమ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి రవాణా చేసేస్తున్నారు. ఇనుప ఖనిజం గనులకు లైసెన్సులు కూడా వీరి వద్ద ఉండవు. అయితే ఏదో ఒక ఖనిజం పేరుతొ లైసెన్స్ పొంది ఆ ఖనిజానికి బదులుగా ఇనుప ఖనిజాన్ని తవ్వి తరలించి వేస్తున్నారు.

వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామ సమీపంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. అయితే ఈ ఇనుప ఖనిజాన్ని ఎర్రమట్టిగా రికార్డుల్లో చూపిస్తున్నారు. ఎర్రమత్తిని తవ్వడానికి అతి తక్కువ ఫీజు చెల్లించి దానిరూపంలో ఉన్న ఇనుప ఖనిజాన్ని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీన్ని ప్రధానంగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న నల్గొండ జిల్లాకు పంపుతున్నారు. అక్కడ దీన్ని శుద్ధిచేసి స్టీల్ ఫ్యాక్టరీలకు విక్రయించి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ దోపిడీ సాగుతున్నప్పటికీ అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదు. ఎర్రమట్టి రూపంలో విలువైన ఇనుప ఖనిజం స్వాహా చేస్తూ దోపిడీదారులు కోట్లాది రూపాయలు దర్జాగా అనుభవిస్తున్నారు.