పక్క దారి పడుతున్న ఉద్యమాలు

 

మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు తెలంగాణావాదులు హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఉన్న మహానీయుల విగ్రహాలు కూల్చినప్పుడు యావత్ తెలుగు జాతి సిగ్గుతో తలవంచుకొంది. దానిని సమర్ధించిన సదరు నేతలను కూడా ప్రజలు తీవ్రంగా అసహ్యించుకొన్నారు. అదేవిధంగా అఖిలపక్షం తరువాత జరిగిన సభలో తెరాస అధ్యక్షుడు జాతీయ నాయకులయిన నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను నోటికొచ్చినట్లు తూలనాడినప్పుడు కూడా ప్రజలు అంతే తీవ్రంగా స్పందించారు. అయితే, ఇప్పుడు అదే తప్పును కొందరు సమైక్యవాదులు చేస్తుండటం చాలా విచారకరం. ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా తీవ్రంగా ఖండించవలసిందే.

 

అనంతపురం జిల్లాలో కొందరు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలకు నిప్పు పెట్టడం, కూల్చివేయడం చాలా హేయమయిన చర్య. కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేఖించడాన్నిఎవరూ తప్పు పట్టరు. కానీ, అందుకు ఆ పార్టీకి చెందిన నేతల విగ్రహాలను ద్వంసం చేయడం మాత్రం చాలా తప్పు. ఆవిధంగా చేయడం కేవలం ఒక వికృతి సంస్కృతికి అద్దం పడుతుంది.

 

అదేవిధంగా 365 రోజులు ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీ బస్సులను తగులబెట్టడం, ద్వంసం చేయడం అంటే మన స్వంత ఆస్తులను మనమే నాశనం చేసుకోవడమే అవుతుంది. ఇక, వివిధ సంస్థల కార్యాలయాలలోకి జొరబడి ఆస్తులను ద్వంసం చేయడం, రోడ్డు మీద కనబడిన వాహనాలకి నిప్పుపెట్టడం వంటి చర్యల వల్ల సాటి ప్రజలకు నష్టం కలిగించడమే తప్ప అది ఉద్యమానికి ఎంత మాత్రం ఉపయోగపడదు.

 

ఉద్యమం ఎవరు పాల్గొన్నా లేకున్నా కొనసాగుతూనే ఉంటుంది. కానీ, ఇటువంటి సంఘ వ్యతిరేఖ చర్యలకు పాల్పడినవారు మాత్రం పోలీసు కేసులలో ఇరుకొని తమ జీవితాలు పాడుచేసుకొన్నవారవుతారు. అందువల్ల సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమం చేస్తున్న వారు రాజకీయ నేతల ప్రభోదాలకి లొంగి ఆవేశపూరితంగా ప్రవర్తించడం కంటే, తమ ఉద్యమంతో ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా నిలవాలి.