శామ్ గురించి వింటే... జీవితం మారిపోతుంది!

 

కష్టాలు మనుషులకి కాకపోతే మానులకి వస్తాయా! అంటాం. కానీ చిన్నపాటి కష్టం వస్తే చాలు తల్లడిల్లిపోతాం. మనసుని ఎలా సముదాయించుకోవాలో, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో తెలియక తలకిందులైపోతాం. కానీ కొందరుంటారు. ఎంతటి కష్టం వచ్చినా, నిబ్బరంగా అడుగు ముందుకు వేస్తారు. తమకి తాము ధైర్యం చెప్పుకొంటూనే... తోటివారికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. అలాంటివాడే ‘శామ్ బెర్స్స్’ (Sam Berns).

 

శామ్ పుట్టగానే అతను మిగతా పిల్లల్లాగే సాధారణమైనవాడని అనుకున్నారు తల్లిదండ్రులు. ఒకవేళ చిన్నాచితకా ఆరోగ్య సమస్య వచ్చినా తాము తీర్చేయవచ్చనుకున్నారు. ఎందుకంటే శామ్ తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల వైద్యులే! కానీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకీ సమాధానం ఉంటుందనుకోవడం అత్యాశే కదా! శామ్కి రెండేళ్లు వచ్చేసరికి అతను progeria అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తేలింది.

 

Progeria చాలా అసాధారణమైన వ్యాధి. ప్రతి 40 లక్షలమందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జన్యువులలో కలిగే ఒక అసాధారణ మార్పు వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధి సోకినవారు పదేళ్లకే ముసలివాడిలా మారిపోతారు. పసివయసులోనే బట్టతల వచ్చేస్తుంది, చర్మం ముడతలు పడుతుంది, ఎముకలు పెళుసుబారిపోతాయి, శరీరం వంగిపోతుంది, గుండె వంటి అవయవాలన్నీ బలహీనపడిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే Progeriaతో 90 ఏళ్ల ముసలివారు పడే బాధలన్నీ పసివయసులోనే అనుభవిస్తారు.

 

శామ్కి ఊహ తెలిసేసరికి తన కష్టమేమిటో అర్థమైపోయింది. కానీ ఆ కష్టంతో జీవించడం ఎలాగో అలవాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘progeria వల్ల నేను చాలా పనులు చేయలేకపోవచ్చు. కానీ వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా! చేయలేని విషయాల గురించే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే... చేరుకోదగిన లక్ష్యాలని కూడా మనం కోల్పోతాం,’ అంటాడు శామ్. అందుకనే తనేం చేయగలడో, వాటన్నింటినీ సాధించే ప్రయత్నం చేశాడు. చదువుకోవడం, సంగీతం నేర్చుకోవడం, డాన్స్ చేయడం, యాత్రలకి వెళ్లడం.. ఇలా తన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే ప్రయత్నం చేశాడు.

 

శామ్ సానుకూల దృక్పథం అతనివరకే పరిమితం కాలేదు. తనకి ఉన్న అరుదైన వ్యాధి గురించి ప్రపంచం మొత్తానికీ చాటాలని అనుకున్నాడు. ఆ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, ఆ వ్యాధి కలిగినవారిలో ఆశని నింపడం కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. శామ్ తల్లిదండ్రులు అప్పటికే Progeria Research Foundation అనే సంస్థని ఏర్పాటే చేశారు. ఆ సంస్థకి ఒక బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయాడు శామ్.

 

శామ్ పుణ్యమా అని Progeria అనే వ్యాధి గురించి ప్రపంచానికి తెలియడం మొదలైంది. కేవలం Progeriaనే కాదు, ఎలాంటి కష్టంతో అయినా కలిసి జీవించడం ఎలాగో శామ్ని చూసి జనం ప్రేరణ పొందసాగారు. 2013లో HBO శామ్ వ్యక్తిత్వం గురించి Life According to Sam పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. అదే ఏడాది TED అనే సంస్థ శామ్తో ఒక ఆన్లైన్ ఉపన్యాసం ఇప్పించింది. ఈ వీడియోని రెండుకోట్ల మందికి పైగా చూశారంటే శామ్ ప్రభావం ఏపాటిదో అర్థమైపోతుంది.

 

TED ఉపన్యాసంలో జీవితం గురించి తన అభిప్రాయాన్ని మూడు ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేశాడు శామ్. ఒకటి – మన గురించి మనం తక్కువగా ఆలోచించుకుంటూ జీవితాన్ని వృధా చేసుకోకుండా, చేయదగిన పనుల మీద దృష్టి పెట్టడం, రెండు – మనల్ని అర్థం చేసుకునే ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులని మన చుట్టూ ఉంచుకోవడం, మూడు – ఎట్టిపరిస్థితుల్లోనూ జీవితాన్ని ముందుకు సాగించడం. అది ఒకో అడుగే కావచ్చు, చిన్నపాటి అడుగే కావచ్చు. కానీ ముందుకు సాగుతూ ఉండటమే!

 

TED ఉపన్యాసంలో శామ్ తను ఓ గొప్ప శాస్త్రవేత్తని కావాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ కొద్ది నెలలకే అతను చనిపోయాడు. బహుశా తను ఎక్కువకాలం బతకనని శామ్కి కూడా తెలుసేమో! ఎందుకంటే Progeria వచ్చినవారు సాధారణంగా 13 ఏళ్లకి మించి బతకరు. కానీ ఆ తలపుకి శామ్ లొంగలేదు. 17 ఏళ్ల వరకు నిబ్బరంగా బతికేశాడు. ప్రతి రోజునీ తనదిగా చేసుకుంటూ సాగిపోయాడు. అందుకే శామ్ ఈ లోకంలో లేకపోయినా... తన గురించి విన్నవారందరికీ స్ఫూర్తినిచ్చే జీవితాన్నిచ్చి వెళ్లాడు.

- నిర్జర.