TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయ పిపీలకం సజ్జల.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Published on: Tue Jun 10, 2025 4:31PM

అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో స్పందించింది. తాజాగా ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్, ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీకి ఓ లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. కృష్ణంరాజుపై తీసుకున్న చర్యల నివేదికను మూడు రోజులలోగా సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఇక ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు. పలు ప్రాంతాలలో సాక్షి కార్యాలయాల ముందు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆ ఆందోళనలు చేస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు.  అంతే కాకుండా ఆందోళనలు చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు, సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

సజ్జల వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇక సజ్జల వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరరెడ్డి సజ్జలను రాజకీయ పిపీలకంగా అభివర్ణించారు. అచ్చోసిన ఆంబోతులా సజ్జల నీచాతినీచమైన వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జలను రాష్ట్రబహిష్కరణ చేయాలని డిమాండ్ చే శారు. సజ్జల జగన్ గుమాస్తా అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన రాష్ట్ర రాజకీయాలతో, ప్రజలతో సంబంధం లేని బంట్రోతు అంటూ, రాజకీయ విమర్శలు చేసే అర్హత సజ్జలకు లేదని పేర్కొన్నారు.  

తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా సజ్జలపై విమర్శల వర్షం కురిపించారు. సజ్జలను ఓ మూర్ఖుడిగా అభివర్ణించిన షర్మిల ఇదే సజ్జల కుమారుడు వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనపై కూడా అనుచిత విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. జగన్ కు సొంత చెల్లి అంటేనే మర్యాద లేదు.. ఇక రాష్ట్రంలో మహిళలపట్ల గౌరవం ఉంటుందని ఎలా భావిస్తామని ప్రశ్నించారు.