Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ కు బదులు సజ్జల జైలు యాత్రలు.. సంకేతమేంటి?!
posted on: Jun 4, 2025 3:53PM
.webp)
వైసీపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ కీలక నేతలంతా జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు అనివార్యమని అంతర్గత సంభాషణల్లోనే కాదు, మీడియా సమావేశాలలో కూడా చెప్పేస్తున్నారు. అదే జరిగితే పార్టీ సారథ్యం ఎవరిదన్న విషయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, ఆయన జైలు ములాఖత్ లు జగన్ అరెస్టైతే పార్టీ పగ్గాలు చేపట్టేది తానేనని సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉందని వైసీపీ వర్గాల్లోనే ఓ రేంజ్ లో చర్చ సాగుతోంది.
తొలి నుంచీ కూడా ఒక వేళ జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి భారతి చేపడతారన్న భావన పార్టీ వర్గాల్లో కనిపించేది. అయితే భారతి పెద్దగా జనంలోకి రాకపోవడం, వైసీపీ నేతల అరెస్టులపై ఆమె ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నారని అవగతమౌతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల పేరు తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే సజ్జల ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో ఒకింత చురుకుగా, చొరవగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలకు సంబంధించిన బాధ్యతలు సజ్జలే చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఇటీవలి కాలంలో తరచుగా ఆయన జైలు ములాఖత్ లు జరుపుతున్నారు. గతంలో ఈ పని జగన్ చేసేవారు. అయితే కారణాలేమైతేనేం.. జగన్ జైలు పరామర్శలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆయన స్థానంలో ఆ పని సజ్జల చేస్తున్నారు. ఇటీవలే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను గుంటూరు జైల్లో సజ్జల కలిసి పరామర్శించారు.
వైసీపీ అధికారంలో ఉండగా నందిగం సురేష్ అరాచకాలు, దౌర్జన్యాలూ ఓ రేంజ్ లో ఉండేవి. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడిలో పాల్గొన్న వారిలో అత్యధికులు నందిగం అనుచరవర్గమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు.. నందిగం సురేష్ పై పలు కేసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నందిగం సురేష్ పై ఉన్న కేసుల బూజు దులిపింది. దీంతో ఆయన అరెస్టయ్యారు. ఆ తరువాత బెయిలు వచ్చింది. కానీ మరో కేసులో ఆయన ఇటీవల మళ్లీ అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ తో సజ్జల సోమవారం (జూన్ 2)న. సజ్జల ములాఖత్ అయ్యారు. నందిగం సురేష్ బాగోగులు, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన సజ్జల ఆయనకు ధైర్యం చెప్పారు, దీంతో ఇప్పుడు సజ్జల జైల్లో ములాఖత్ లకు సంకేతమేంటన్న చర్చ పార్టీలో ప్రారంభమైంది. గతంలో చలా మంది వైసీపీయులు అరెస్టైనా జైలుకెళ్లి వారితో ములాఖత్ కాని సజ్జల ఇటీవలి కాలంలో వరుసగా జైలు పర్యటనలు చేయడం వెనుక గట్టి వ్యూహమే ఉందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు,
నందిగం కంటే ముందు సజ్జల విజయవాడ సబ్ జైలులో మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సజ్జల నేరుగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ కలిశారు. ఆ తరువాత నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డినీ కలిశారు. ఇప్పుడు తాజాగా నందిగం సురేష్ తో గుంటూరు జైలులో ములాఖత్ అయ్యారు. దీంతో ఒక వేళ జగన్ జైలుకు వెడితే ఆయన ఆబ్సెన్స్ లో సజ్జలే పార్టీని నడిపిస్తారన్న సంకేతాలను ఆయన తన ములాఖత్ భేటీల ద్వారా చాటుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



.webp)


