TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సజ్జలకూ చెరశాల?.. అటవీ భూముల కేసులో అడ్డంగా బుక్

Published on: Thu May 22, 2025 3:10PM

 వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సర్వం తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కర్మఫలం అనుభవించడానికి రెడీ కాక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు పిల్ల సజ్జల జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా చేసిన నిర్వాకానికి అజ్ణాతంలో గడుపుతున్నారు. కేసుల్లో అరెస్టు బెయిలు రక్షణ ఉన్నప్పటికీ భయంతో బెంబేలెత్తుతున్నారు. నోరు విప్పి మాట్లాడడానికి జంకుతూ మౌనాన్ని ఆశ్రయించారు. ఇక  ఇప్పుడు పెద్ద సజ్జల అదే సజ్జల రామకృష్ణారెడ్డి బూబాగోతాన్ని తేల్చేందుకు సర్కార్ సమాయత్తమైంది. తాజాగా ఆయన ఆక్రమించి అనుభవిస్తున్న 55 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  క‌డ‌ప జిల్లా సీకే దిన్నెమండ‌లం ప‌రిధిలోని అట‌వీ భూముల్లో 55 ఎక‌రాల‌ను సజ్జల ఆక్రమించి   సజ్జ‌ల ఎస్టేట్‌ నిర్మించిన‌ట్టు వచ్చిన ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.  

దీంతో  క‌లెక్ట‌ర్ ఆదేశాలతో రెవెన్యూ, అట‌వీ శాఖల అధికారుల‌ బృందం స‌జ్జ‌ల ఎస్టేట్‌లో ప‌ర్య‌టించి.. నిజనిజాల నిగ్గు తేల్చింది. సజ్జల అటవీ భూముల ఆక్రమణ వాస్తవమేనని అధికారుల బృందం నివేదిక సమర్పించింది.  ఆ నివేదిక ఆధారంగా  సజ్జల ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సంబంధిత భూముల‌ను స్వాధీనం చేసుకుని.. కంచె ఏర్పాటు చేయ‌డంతోపాటు.. హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు.   అయితే సజ్జల కబ్జాల పర్వం, ఆక్రమణల వ్యవహారం ఇంతటితో ఆగేది కాదు. ఆగే అవకాశమూ లేదు. ఎందుకంటే.. జగన్ హయాంలో సజ్జల కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి సజ్జలకు సహకరించిన అధకారులందరిపైనా అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా సజ్జల కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు. 

ఆక్ర‌మిత భూమిలో ఉన్న చెట్ల‌ను న‌రికి వేయ‌డం.. అట‌వీ సంప‌ద‌కు న‌ష్టం క‌లిగించ‌డం పైనా ప‌రిహారం వ‌సూలు చేయడమే కాకుండా,  కేసు న‌మోదు చేసి.. జైలుకు త‌ర‌లించే అవ‌కాశం కూడా ఉంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో జగన్ హయాంలో నిబంధనలు, విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా చట్ట, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన ఘనులంతా ఇప్పుడు చట్టం ముందు దోషులుగా నిలవక తప్పదని అంటున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు, గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసు, ముంబై నటి కాదంబరి జత్మలాని కేసుల్లో పలువురు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ జాబితాలో సజ్జల కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.